
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన గుజరాత్ జెయింట్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తడబడుతోంది.. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే సబ్బినేని మేఘన వికెట్ కోల్పోయింది గుజరాత్ జెయింట్స్...
2 బంతులాడిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘనని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మారిజానే కాప్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు పడగొట్టింది మారిజానే కాప్... గాయంతో డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ ప్లేస్‌లో వచ్చిన లౌరా వాల్వర్డ్‌ని క్లీన్ బౌల్డ్ చేసింది మారిజానే కాప్...
ఆ తర్వాత అష్‌లీగ్ గార్డ్‌నర్ కూడా మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడంతో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ జెయింట్స్. దయాళన్ హేమలత, శిఖా పాండే బౌలింగ్‌లో వికెట్ కీపర్ తానియా భాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది...
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేసింది హర్లీన్ డియోల్. 14 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ కూడా మారిజానే కాప్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది. ఆ తర్వాత 10 బంతుల్లో 2 పరుగులు చేసిన సుష్మా వర్మను క్లీన్ బౌల్డ్ చేసిన మారిజానే కాప్... 5 వికెట్లు పూర్తి చేసుకుంది..
33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది గుజరాత్ జెయింట్స్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన కాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి రెండోది కావడం విశేషం. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ తారా నోరిస్, డబ్ల్యూపీఎల్‌లో మొదటి 5 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తారా నోరిస్, 29 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా మారిజానే కాప్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం...
10 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది గుజరాత్ జెయింట్స్. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్ జెయింట్స్, ఆర్‌సీబీతో తొలి విజయాన్ని అందుకోగా వరుసగా మొదటి రెండు మ్యాచుల్లో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది..