
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ కాగా టీమిండియా కూడా ధీటుగా బదులిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. కెప్టెన్ రోహిత్ 35 పరుగులు చేసి అవుట్ అయినా శుబ్‌మన్ గిల్ 128 పరుగులు చేసి రికార్డు సెంచరీ నమోదు చేశాడు...
ఈ ఏడాది టీ20ల్లో, వన్డేల్లో, టెస్టుల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. శుబ్‌మన్ గిల్ సెంచరీకి తోడు ఛతేశ్వర్ పూజారా 42, విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో మూడో రోజు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది భారత జట్టు...
అయితే ఓవర్‌నైట్ స్కోర్ 30/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, ఆరంభంలో ఓ గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో శుబ్‌మన్ గిల్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, ఆస్ట్రేలియా రివ్యూ తీసుకుంది..
టీవీ రిప్లైలో బంతి వెళ్లి నేరుగా వికెట్లను తాకుతున్నట్టు కనిపించింది. దీంతో శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంలో అటు ఆస్ట్రేలియా, ఇటు శుబ్‌మన్ గిల్ కూడా షాక్ అయ్యాడు... దీనికి కారణం 3 మీటర్ల రూల్...
నాథన్ లియాన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు క్రీజు వదిలి బాగా ముందుకు వచ్చేశాడు శుబ్‌మన్ గిల్. ఇదే అతన్ని కాపాడింది. గిల్‌ని తాకిన తర్వాత బంతి, 3 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాతే వికెట్లను తాకినట్టు బాల్ ట్రాకింగ్‌లో కనిపించింది. బంతి ఈ దిశగా వెళ్తుందేమో అనే అంచనాతో సాంకేతికంగా బాల్ ట్రాకింగ్‌ని చూపిస్తారు. అంతే కానీ బంతి కచ్ఛితంగా అదే దిశగా వెళ్తుందని చెప్పలేం...
అందుకే అంపైర్స్ కాల్ ద్వారా సాంకేతికత కంటే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది క్రికెట్ నియామావళి. దీంతో 3 మీటర్ల దూరాన్ని అంచనా వేయడం సాంకేతికంగా పక్కాగా చెప్పడం అయ్యే పని కాదు. అందుకే 3 మీటర్ల రూల్ ప్రకారం బంతి వికెట్లను తాకినా ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ప్రాధాన్యం ఇచ్చి నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...
డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియా, ఓ రివ్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఇది జరిగే సమయానికి శుబ్‌మన్ గిల్ స్కోరు 35 పరుగులు మాత్రమే. ఆ తర్వాత మూడు ఓవర్లకే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. రోహిత్ శర్మతో తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 113 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు...
విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి పెవిలియన్ చేరాడు శుబ్‌మన్ గిల్. ఈ ఏడాదిలో శుబ్‌మన్ గిల్‌కి ఐదో సెంచరీ కాగా... టెస్టు కెరీర్‌లో రెండో సెంచరీ.