Lucknow Super Giants: గంభీర్ కు కరోనా పాజిటివ్.. మెగా వేలానికి ముందు లక్నోకు టెన్షన్

By Srinivas MFirst Published Jan 25, 2022, 11:34 AM IST
Highlights

Gautam Gambhir Tests Positive For Covid-19:  భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతం గంభీర్ కు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. త్వరలో ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో... 
 

టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో ఫ్రాంచైజీకి మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ కు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన గంభీర్.. ‘తేలికపాటి లక్షణాలతో ఇబ్బందిపడ్డ నాకు ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. నా  కాంటాక్టులోకి వచ్చిన వాళ్లు పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను...’ అని  ట్వీట్ లో పేర్కొన్నాడు. 

భారత్ లో విజృంభిస్తున్న కరోనా కేసులు టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లను కూడా వదలడం లేదు. థర్డ్ వేవ్ మొదలైన వెంటనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత బీసీసీఐ లోని పలు అధికారులకు కూడా కరోనా సోకింది. 

 

After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested.

— Gautam Gambhir (@GautamGambhir)

షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సి ఉన్న రంజీ సీజన్ కు ముందు బెంగాల్,  మహారాష్ట్ర కు చెందిన పలువురు  వర్తమాన క్రికెటర్లు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.  దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత వన్డే జట్టుకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ కు కూడా కరోనా సోకడంతో అతడు ఏకంగా సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం దుబాయ్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడటానికి వెళ్లిన హర్భజన్ సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఇప్పుడు తాజాగా గంభీర్ సైతం వైరస్  బారిన పడ్డాడు. 

కాగా.. గంభీర్ త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు కోరుతున్నారు.  గంభీర్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘గెట్ వెల్ సూన్ సర్..’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఐపీఎల్ వేలానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో గంభీర్ కు కరోనా సోకడం  ఆయన మెంటార్ గా ఉన్న లక్నో జట్టుకు నష్టం కలిగించేదే.  

 

Team owner, Dr. Sanjiv Goenka, Chairman unveils the name for the Lucknow IPL team. 😊👏🏼 pic.twitter.com/TvGaZlIgFR

— Lucknow Super Giants (@LucknowIPL)

ఇదిలాఉండగా..  సోమవారం లక్నో జట్టుకు ఆ ఫ్రాంచైజీ ఓనర్  సంజీవ్ గొయెంకా నామకరణం చేశారు. ఆ జట్టు పేరును ‘లక్నో సూపర్ జెయింట్స్’గా ప్రకటించారు. కెఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు.. ఇప్పటికే మార్కస్  స్టాయినిస్, రవి బిష్ణోయ్ లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. 


లక్నో జట్టుకు  పేరు పెట్టడానికి ఆ ఫ్రాంచైజీ వినూత్న రీతిలో ప్రజల్లోకి వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని  పురాతన కట్టడాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మన టీమ్ కు మీరే పేరు పెట్టండి...’అని  సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ నడిపింది. ఆ రకంగా  అప్పట్నుంచే ఉత్తరప్రదేశ్ వాసులతో మమేకమైంది. సుమారు 20 రోజుల క్యాంపెయిన్ అనంతరం.. సోమవారం సంజీవ్ గొయెంకా  ఆ పేరును వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ‘లక్నో ఫ్రాంచైజీకి పేరు పెట్టడానికి గాను మేము సోషల్ మీడియాలో ఓ  పోల్ నిర్వహించాము. దానికి మాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ట్విట్టర్,  ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్,  తదితర  సామాజిక మాధ్యమాల నుంచి  వచ్చిన పేర్ల నుంచి అత్యంత ప్రజాధరణ  పొందిన పేరు లక్నో సూపర్ జెయింట్స్..’ అని వెల్లడించారు. 
 

click me!