మనను ఓడించడం అంత సులువు కాదు.. కానీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. లక్నో ఆటగాళ్లకు గంభీర్ హెచ్చరిక

By Srinivas MFirst Published May 25, 2022, 11:48 AM IST
Highlights

IPL 2022 LSG vs RCB: ఐపీఎల్-15 లో తొలి క్వాలిఫైయర్ ముగిసింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య  ఎలిమినేటర్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆ జట్టు  ప్లేఆఫ్స్ లో ముందుకెళ్తుంది. ఓడితే ఇంటికే. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్-15 లో నేడు మరో కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. క్వాలిఫైయర్ - 1 లో  గుజరాత్- రాజస్తాన్ మధ్య ముగిసిన పోరులో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్  ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక నేడు  తొలి మ్యాచ్ జరిగిన ఈడెన్ గార్డెన్ వేదికగానే లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నడుమ  ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్ మ్యాచ్ మాదిరిగా  ఓడిన జట్టుకు ఈ మ్యాచ్ లో  మరో అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో లక్నోకు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్.. ఆ జట్టు ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. మ్యాచ్ కు ముందు వారిలో స్ఫూర్తిని రగిలించే స్పీచ్ ఇచ్చాడు. 

లక్నో జట్టు ట్విటర్ వేదికగా విడుదల చేసిన వీడియోలో  గంభీర్ మాట్లాడుతూ...‘అవతల ఉన్నది అత్యంత స్కిల్స్, టాలెంట్ ఉండే జట్టా కాదా..? అన్నది కాదు. ఒత్తిడిని తట్టుకుంటామా..? లేదా..? అన్నది ముఖ్యం.. మనం కలిసి ఆడుదాం. జట్టంతా ఒక్కటిగా ఒకేతాటిమీద ఉందాం. మనమంతా ఒకే దారిలో నడిస్తే ఏ ప్రత్యర్థి జట్టుకైనా మనను ఓడించడం అంత సులువు కాదు..’అని వ్యాఖ్యానించాడు. 

ఐపీఎల్ లో గుజరాత్ మాదిరే  ఈ సీజన్ లోనే  లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన  లక్నో.. లీగ్ దశలో తమను ఓడించిన  బెంగళూరు పై రివేంజ్ తీర్చుకోవడంతో పాటు ఆ జట్టును ఎలిమినేటర్ లోనే ఎలిమినేట్ చేయాలనే కసిగా ఉంది. లీగ్ దశలో జరిగిన  బెంగళూరుతో  జరిగిన మ్యాచ్ లో లక్నో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. లీగ్ లో ఆఖరి మ్యాచ్ లో రెచ్చిపోయిన ఇద్దరు ఓపెనర్లు కెఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ లు  కూడా ఆ ఫామ్ కొనసాగించాలని  లక్నో కోరుకుంటున్నది. వీరికి తోడు దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ కూడా  రాణిస్తే బెంగళూరుకు కష్టమే. బౌలింగ్ లో అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్ లు రాణిస్తుండటం లక్నోకు కలిసొచ్చేదే. 

 

| ‘Walk the same path’, shares Gurumantra ahead of Lucknow Super Giants' eliminator against Royal Challengers Bangalore.

Get behind the scenes access with exclusively on editorji. pic.twitter.com/3lttIu5foY

— Editorji (@editorji)

- ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-2 లో రాజస్తాన్ రాయల్స్ తో తలపడుతుంది. 
-  క్వాలిఫైయర్ - 2 లో విజేత.. మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగబోయే ఫైనల్ లో ఆడుతుంది. 
- ఎలిమినేటర్ లో ఓడిన జట్టు మాత్రం బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్లడమే. 
- ఈ మ్యాచ్ లో బెంగళూరును ఓడించి ఫైనల్ కు చేరాలని గంభీర్ పట్టుదల మీద ఉన్నాడు. ఆ మేరకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడు. 

click me!