
భారత ప్రధాని నరేంద్ర మోడీ తాను పాల్గొనే జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సదస్సులు, ఇతర కార్యక్రమాల్లో ‘ఇండియా ఫస్ట్’ అనే మంత్రాన్ని తరుచూ జపిస్తారు. అంతర్జాతీయ బ్రాండ్‌ల వెంట పడుతున్న యువతలో ‘మేకిన్ ఇండియా’ పట్ల సృహ కల్పించి దేశంలో తయారైన వస్తువులను ప్రోత్సహించేందుకు ఆయన ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది ఇలా ప్రాచుర్యంలోకి వచ్చిందే. భారత్ లో తయారైన వస్తువులను ప్రోత్సహించడం.. స్వదేశీ వస్తువులనే వాడటం.. మన దేశపు ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయడం వంటివాటికి ప్రోత్సాహం అందించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటిని విరివిగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నది. ప్రధాని మోడీ ఇచ్చిన స్ఫూర్తో మరేదో గానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఐదు ఫ్రాంచైజీలు ఇదే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి.
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేలంలో ప్రపంచ మహిళల క్రికెట్ లో స్టార్లుగా వెలుగొందుతున్నవారు ఎందరో పేర్లు నమోదు చేసుకున్నా దాదాపు ఐదు టీమ్ (ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, ఢిల్లీ)లు వారిని పట్టించుకోలేదు. అంతర్జాతీయ స్టార్ పేసర్లు.. స్టార్ బౌలర్లు.. నిలకడగా ఆడే బ్యాటర్లను కూడా ఫ్రాంచైజీలు వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు. మెన్స్ ఐపీఎల్ వేలంలో విదేశీ క్రికెటర్ల జేబులు నింపే ఫ్రాంచైజీలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మాత్రం భారత్ వైపే చూశాయి.
ముంబై వేదికగా సాగుతున్న వేలంలో భారత క్రీడాకారులను దక్కించుకోవడానికి పోటీ పడ్డ ఫ్రాంచైజీలు విదేశీ స్టార్ల జోలికి పోలేదు. మెన్స్ ఐపీఎల్ మాదిరిగా ఒక్కో ఫారెన్ ప్లేయర్ మీద కోటానుకోట్లు ఖర్చూ చేయలేదు. ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఓవర్సీస్ ప్లేయర్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ మాత్రమే. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 3.20 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత జాబితాలో నటాలీ స్కీవర్ ను రూ. 3.20 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.
కెప్టెన్లనూ పట్టించుకోలే..
అంతర్జాతీయ స్థాయిలో తమ దేశ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తున్న చాలా మంది మహిళా క్రికెటర్లు ఈ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. సౌతాఫ్రికా సారథి సున్ లూజీ, శ్రీలంక సారథి చమారీ ఆటపట్టు, ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ విండీస్ సారథి హేలీ మాథ్యూస్ లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. కానీ వేలం తుది దశలో అన్ సోల్డ్ గా ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ విండీస్ సారథి హేలీ మాథ్యూస్ లను ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ ఈ వేలంలో అమ్ముడుపోకపోవడం గమనార్హం.
పేసర్లదీ అదే కథ..
కెప్టెన్లు, బ్యాటర్లే కాదు బౌలర్లదీ అదే కథ. ఆస్ట్రేలియా పేసర్ మేగాన్, బంగ్లా బౌలర్ జహనారా తో పాటు కివీస్ సీమర్ లీ తహుహు , సౌతాఫ్రికా క్రికెటర్ ఆయబొంగ ఖాకా విండీస్ కు చెందిన షకీరా సెల్మన్ లను ఫ్రాంచైజీలు చిన్నచూపే చూశాయి. ఇక కేవలం స్పిన్ మాత్రమే వేసే క్రికెటర్లనైతే ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్న మేగాన్ ను చివర్లో ఆర్సీబీ కొనుగోలు చేసింది.
భారత ప్లేయర్లకు యమా గిరాకీ..
కొంతమంది విదేశీ ప్లేయర్లను మినహా ఫ్రాంచైజీలన్నీ భారత క్రికెటర్ల మీదే ప్రధానంగా ఫోకస్ చేశాయి. భారత్ లో పురుషుల క్రికెట్ తో పాటు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా అభిమానులు ఇట్టే గుర్తుపడతారు. కానీ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న మహిళల క్రికెట్ లో మన క్రికెటర్ల గురించే తప్ప ఇతర దేశాల ఆటగాళ్లు ఎవరో కూడా ఇక్కడి అభిమానులకు అంతగా అవగాహన లేదు. కారణాలేవైనా ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న క్రికెటర్లతో పాటు యువ క్రికెటర్లకూ ఫ్రాంచైజీలు ప్రాధాన్యమిచ్చాయి. వేలం జరిగిన తీరు చూస్తే ఇదే అర్థమవుతోంది.
టీమిండియా స్టార్లు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, పూజా వస్త్రకార్, రాధా యాదవ్, శిఖా పాండే, స్నేహ్ రాణా లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ లీగ్ లో అత్యధిక ధర దక్కించుకున్న వారిలో స్మృతి మంధాన (రూ. 3.40 కోట్లు) అగ్రస్థానంలో నిలవగా దీప్తి శర్మ (రూ. 2.60 కోట్లు), జెమీమా (రూ. 2.20 కోట్లు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు) లు ఊహించని ధరలు దక్కించుకున్నారు.
అండర్ - 19 మహిళల ప్రపంచకప్ గెలిచిన టీమ్ పై కూడా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ టీమ్ లో వైస్ కెప్టెన్ శ్వేతా సెహ్రావత్, ప్రశవి చోప్రా, తితాస్ సాధు లు తప్ప మిగతావారికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. మన్నత్ కశ్యప్, నజ్లా సీఎంసీ, సోనమ్ యాదవ్, షబ్నమ్ లకు నిరాశే ఎదురైంది.
ఓవర్సీస్ ప్లేయర్లలో కూడా ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు చెందిన ఆటగాళ్లే ఎక్కువ మంది చోటు దక్కించుకున్నారు. మెన్స్ ఐపీఎల్ లో ప్రతి టీమ్ లో ఉండే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ప్లేయర్లనూ ఏ ఫ్రాంచైజీ అంతగా ప్రాధాన్యతనివ్వలేదు.