
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2022, జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న ఇయాన్ మోర్గాన్, ఏడు నెలల తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కి కూడా స్వస్తి పలికాడు...
‘సగర్వంగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తున్నా. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఇదే సరైన సమయం అని నిర్ణయం తీసుకున్నా. 2005లో ఇంగ్లాండ్‌కి మారినప్పటి నుంచి మిడిల్‌సెక్స్‌లో చేరడం, సౌతాఫ్రికా20 లీగ్‌లో పర్ల్ రాయల్స్‌కి ఆడడం దగ్గర దాకా నా క్రికెట్ కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ని ఎంతో ఎంజాయ్ చేశా.
ప్రతీ క్రికెటర్ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా కుటుంబం, నా స్నేహితులు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నాకు అండగా నిలిచిన నా భార్య తారాకి, నా కుటుంబానికి, నాకు అన్ని వేళలా తోడుగా నిలిచిన స్నేహితులకు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా..
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నా కుటుంబంతో, నాకు నచ్చిన వాళ్లతో కాస్త సమయం గడపగలిగాను. భవిష్యత్తులో వారికి మరింత సమయం ఇవ్వాలనుకుంటున్నా. ప్రొఫెషనల్ క్రికెట్‌ని చాలా మిస్ అవుతాను.. ’ అంటూ తన రిటైర్మెంట్ లేఖలో రాసుకొచ్చాడు ఇయాన్ మోర్గాన్...
తన కెరీర్‌లో 248 వన్డేలు ఆడి 39.09 సగటుతో 7701 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్, 16 టెస్టులు ఆడి 700 పరుగులు చేశాడు. 115 టీ20 మ్యాచుల్లో 2458 పరుగులు చేసిన మోర్గాన్, అంతర్జాతయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లలో టాప్ 6లో ఉన్నాడు...
ఐపీఎల్‌లో 83 మ్యాచులు ఆడి 1405 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్... బంగ్లా ప్రీమియర్ లీగ్, పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగుల్లో పాల్గొన్నాడు. తన టీ20 కెరీర్‌లో 367 మ్యాచులు ఆడి 37 హాఫ్ సెంచరీలతో 7652 పరుగులు చేశాడు ఇయాన్ మోర్గాన్..
క్రికెట్‌కి పుట్టినిల్లు అయినా ఒక్క వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయిందనే అపవాదును ఇంగ్లాండ్ నుంచి దూరం చేసిన కెప్టెన్‌గా నిలిచాడు ఇయాన్ మోర్గాన్. భారీ అంచనాలతో 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్, ఆ అంచనాలకు మించి రాణించి మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ గెలిచింది...
బెన్ స్టోక్స్ బ్యాటుకి తగులుతూ వెళ్లిన ఓవర్ త్రోకి ఆరు పరుగులు ఇవ్వడం, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు... ఇలా ఛీటింగ్ చేశారని ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా క్రికెట్ ప్రపంచ చరిత్రలోనే సూపర్ ఓవర్ థ్రిల్లర్ ఫైనల్ మ్యాచ్‌ని చూసే అవకాశం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కలిగింది...
2015లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ తీసుకున్న ఇయాన్ మోర్గాన్, 2019లో ఇంగ్లాండ్‌కి వన్డే వరల్డ్ కప్ అందించాడు. మోర్గాన్ కెప్టెన్సీలోనే 2021 టీ20 వరల్డ్ కప్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు, టేబుల్ టాపర్‌గా నిలిచినా... సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...
విజయాలు వస్తూనే రెండున్నరేళ్లుగా సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాడు ఇయాన్ మోర్గాన్. ఐపీఎల్ 2021 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, సీజన్ మొత్తంలో 17 మ్యాచులాడి 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు... నెదర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు వన్డేల్లోనూ డకౌట్ అయిన ఇయాన్ మోర్గాన్, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.