దినేశ్ కొట్టిన సిక్సర్ ఇప్పుడు ఎన్ఎఫ్టీ రూపంలో.. ఈ రికార్డు సాధించబోయే తొలి భారత ఆటగాడు కార్తీకే..

By team teluguFirst Published Oct 12, 2021, 11:42 AM IST
Highlights

Non Fungible Token: భారత్, బంగ్లాదేశ్ మధ్య 2018లో జరిగిన నిదాహస్ ట్రోఫీ అందరికీ గుర్తుండే ఉంటుంది.  ముఖ్యంగా ఆ మ్యాచ్ లో ఆఖర్లో వచ్చిన  వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ విరోచిత ఇన్నింగ్స్ మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్ ను గెలిపించిన కార్తీక్ ఇప్పుడు అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. 

భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య 2018 మార్చిలో Nidahas Trophy జరిగింది. ఆ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ విరోచిత ఇన్నింగ్స్ ను భారత అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన కార్తీక్.. ఆఖరు బంతికి సిక్సర్ కొట్టి బంగ్లా ఆశలపై నీళ్లు చల్లాడు. Indiaకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఆ ఫ్లాట్ సిక్స్ మరో అరుదైన ఘనతను  సొంతం చేసుకోబోతున్నది. 

Dinesh Karthik కొట్టిన ఆ చివరి సిక్సర్ త్వరలోనే NFT రూపంలో లభించనుంది. భారత్ ను గెలిపించాక కార్తీక్ సెలబ్రేట్ చేసుకున్న విజయ క్షణాలు, అందుకు సంబంధించి అతడిలోని ఆలోచనలు, భావోద్వేగాలు ఎన్ఎఫ్టీ గా రానున్నాయి.  కార్తీక్ భావోద్వేగాలను కలబోసిన NFTయానిమేషన్ రూపంలో పొందుపరిచే పనిలో ఉన్నారు ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్న అతడి బంధువు. 

NFT అంటే ఏమిటి..? 

ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ. డబ్బ విలువ మారకం తగ్గింది. అంతా ఆన్లైన్ వేదికలుగానే వర్తక, వ్యాపారాలు సాగుతున్నాయి.  ఇందులో భాగంగానే  క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కాయిన్స్, బిట్ కాయిన్, డిగో కాయిన్ వంటివి మార్కెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. రేపటి భవిష్యత్ అంతా వీటిదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇవి ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఎదుగుతున్నాయి.  ఇదే క్రమంలో సెలబ్రిటీలు, ప్రముఖులకు సంబంధించిన మాటలు, పాటలు, నటన, ఇతరత్రా విషయాలకు సంబంధించిన విషయాలను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చుతారు. వీటిని బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఆన్లైన్ లో వేలం వేస్తారు.  ఇదొక ఆర్ట్ వర్క్ వంటిది. యానిమేషన్ సాయంతో వీటిని తయారు చేస్తారు. వీటిని Non Fungible Tokensగా వ్యవహరిస్తారు.
 
క్రిప్టో కరెన్సీ మాదిరిగానే ఈ ఎన్ఎఫ్టీ లు భద్రంగా ఉంటాయి. ప్రముఖులకు సంబంధించిన ఈ డిజిటల్ ఆస్తులు..  వాటిని దక్కించుకున్న వారికే చెందుతాయి. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా పిలుస్తారు. అంతేగాక ఈ టోకెన్లతో క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేసుకునే వీలుంటుంది. 

కాగా దీనిపై దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘నిదాహస్ ఫైనల్ నా జీవితంలో ఒక అత్యద్భుత క్షణాల్లో ఒకటి. అవి మళ్లీ ఇప్పుడు ఎన్ఎఫ్టీ రూపంలో తిరిగిరావడం నాకు సంతోషంగా ఉంది’ అని అన్నాడు. భారత జట్టులో ఇలా ఒక క్రికెటర్ కు సంబంధించిన ఎన్ఎఫ్టీ  రావడం ఇదే ప్రథమం. భారత క్రికెట్ లోనే కాదు.. క్రీడలకు సంబంధించి దేశంలో  ఇలాంటి ఎన్ఎఫ్టీలు ఏ క్రీడాకారుడి పేరు మీదా లేదు. కాగా, దినేశ్ కార్తీక్ ఎన్ఎఫ్టీ ని నేటి నుంచే  ఆన్లైన్ లో వేలం వేయనున్నట్టు తెలుస్తున్నది. 

click me!