
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ సెకండాఫ్‌లో అద్భుత ప్రదర్శనతో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి , ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. క్రిస్ గేల్ వచ్చిన తర్వాత వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ పంజాబ్‌కి విజయం దక్కడం విశేషం.
150 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ 25 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి అవుట్ కాగా... ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్, మన్‌దీప్ సింగ్ కలిసి రెండో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఛేజింగ్‌ను ఈజీ చేసేశారు.
మన్‌దీప్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, క్రిస్ గేల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఫర్గూసన్‌లకి చెరో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో నాలుగో స్థానానికి ఎగబాకిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ప్లేఆఫ్ రేసులో ఐదో స్థానానికి పడిపోయిన కేకేఆర్‌తో పోటీపడనుంది.