
న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ ను శుక్రవారం దురదృష్టం వెంటాడింది. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో అతడు విచిత్రకర రీతిలో పెవిలయన్ కు చేరాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 55వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్ లో నికోల్స్ నాన్ స్ట్రైకర్ గా ఉన్న డారెల్ మిచెల్ వైపు షాట్ ఆడాడు. అప్పుడక్కడ ఉన్న మిచెల్ ఆ బంతిని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్ తాకడంతో నికోల్స్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. బ్యాట్ తాకితే పెవిలియన్ చేరడం ఎందుకు..?
బంతిని తప్పించుకునే క్రమంలో మిచెల్ పక్కకు జరిగినా బాల్ అతడి బ్యాట్ కు తాకి అంపైర్ మీదుగా మిడ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. అంతే ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. వారిలో ఒకరు బౌలింగ్ వేసిన జాక్ లీచ్, రెండోది బ్యాటింగ్ చేసిన హెన్రీ నికోల్స్.. మూడోవాడు డారెల్ మిచెల్.
నికోల్స్ ఔటైన విధానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఔట్ పై క్రికెట్ లో నిబంధనలు, మార్గదర్శకాలు వెలువరించే మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) స్పందించింది. ఇది ఔటేనని.. అందుకు సంబంధించి క్రికెట్ లో నిబంధనలను కూడా పొందుపరిచామని తెలిపింది.
‘దురదృష్టవశాత్తు నికోల్స్ ఔటయ్యాడు. కానీ ఇది పూర్తిగా చట్టాలకు లోబడి తీసుకున్న నిర్ణయమే. క్రికెట్ చట్టాలలోని 33.2.2.2 నియమం ప్రకారం బంతి.. వికెట్, అంపైర్, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ పడితే అది ఔట్‌గా పరిగణించబడుతుంది’ అని ట్విటర్ వేదికగా స్పందించింది.
కాగా ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్ డకౌట్ అవగా.. విల్ యంగ్ (20), కేన్ విలియమ్సన్ (31), డెవాన్ కాన్వే (26) మరోసారి విఫలమయ్యారు. హెన్రీ నికోల్స్ (19)తో కలిసి డారిల్ మిచెల్ (78 బ్యాటింగ్) ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న క్రమంలో నికోల్స్ పై విధంగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మిచెల్ తో పాటు టామ్ బ్లండెల్ (45 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు తీయగా.. జెమీ ఓవర్టన్ ఓ వికెట్ పడగొట్టాడు.