ఇలాంటి వాటికి ఎండార్స్‌మెంట్‌లా : కోహ్లీ, తమన్నాలకు కోర్టు నోటీసులు

By Siva KodatiFirst Published Jan 27, 2021, 9:45 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి తమన్నా, మలయాళం నటుడు అజు వర్గీస్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ వివాదంలో వీరికి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి తమన్నా, మలయాళం నటుడు అజు వర్గీస్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ వివాదంలో వీరికి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఆన్‌లైన్ ‌రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వున్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్‌ ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు ప్రముఖులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టడంతో పాటు వీటిని రద్దుచేయాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ముగ్గురు సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ వ్యవహారంలో వివరణ ఇ‍వ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

కాగా  ఈ వివాదంలో పలువురు నటులుతో పాటు, క్రికెటర్లపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ,  హీరోయిన్‌ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు గతేడాది మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని వారిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

click me!