2 వేల దరఖాస్తులు, ఆ ఆరుగురికే పిలుపు: నేటి నుంచి కోచ్ ఎంపికకు ఇంటర్వ్యూలు

By Siva KodatiFirst Published Aug 13, 2019, 8:32 AM IST
Highlights

భారత క్రికెట్ జట్టుకు కోచ్ ఎంపిక ప్రక్రియలో బీసీసీఐ మరింత దూకుడు పెంచింది. ఈ శుక్రవారం కోచ్ పదవికి ఇంటర్వ్యూలు చేపట్టనుంది. కపిల్ దేవ్ , అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ.. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసింది

భారత క్రికెట్ జట్టుకు కోచ్ ఎంపిక ప్రక్రియలో బీసీసీఐ మరింత దూకుడు పెంచింది. ఈ శుక్రవారం కోచ్ పదవికి ఇంటర్వ్యూలు చేపట్టనుంది. కపిల్ దేవ్ , అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ.. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసింది.

వీరిలో రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుట్‌లు ఉన్నారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు సంబంధించి అభ్యర్ధులకు సమాచారం అందించారు. నేరుగా ముంబై రాలేని వారు స్కైప్ ద్వారా ఇంటర్య్యూలో పాల్గొంటారు.

విండీస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొని, ప్రజెంటేషన్ ఇస్తారు. మరోవైపు రవిశాస్త్రిని కోచ్‌గా కొనసాగించాలని ఎక్కువ మంది కోరుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అన్షుమన్ గైక్వాడ్‌తో పాటు పలువురు మాజీలున్నారు. దీంతో మళ్లీ రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే కోచ్ ఎంపికలో సెలక్షన్ కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు టామ్ మూడీ, మైక్ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురు కావచ్చని తెలుస్తోంది.

కాగా కపిల్ కమిటీ ప్రధాన కోచ్ పదవికి మాత్రమే ఇంటర్వ్యూలు చేపట్టనుంది. సహాయ కోచ్‌లు, ఇతర సిబ్బంది కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నిర్వహించనున్నారు. ప్రధాన కోచ్‌ సహా అన్ని పదవులకు కలిపి సుమారు 2 వేల వరకు దరఖాస్తులు రావడం విశేషం. 

click me!