కేన్ విలియంసన్ సంచలన నిర్ణయం... వరుస వైఫల్యాలతో టెస్టు కెప్టెన్సీకి రాజీనామా...

By Chinthakindhi RamuFirst Published Dec 15, 2022, 9:20 AM IST
Highlights

వర్క్‌లోడ్ ప్రెషర్‌తో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న కేన్ విలియంసన్... సీనియర్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీకి టెస్టు కెప్టెన్సీ... 

ప్రస్తుత తరంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో కేన్ విలియంసన్ ఒకడు. కేన్ మామ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి అర్హత సాధించింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచి, రికార్డు క్రియేట్ చేసింది... అయితే ఆ తర్వాత వరుస వైఫల్యాలతో డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో అట్టడుగుకి పడిపోయింది..

న్యూజిలాండ్ వరుస మ్యాచుల్లో ఓడిపోతుండడంతో పాటు కెప్టెన్ కేన్ విలియంసన్ బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. గాయాలతో చాలా మ్యాచులకు దూరమవుతూ ఆడిన మ్యాచుల్లోనూ సరిగ్గా రాణించలేకపోతున్నాడు. 

మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన కేన్ విలియంసన్, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. కేన్ విలియంసన్ స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ టీమ్ సౌథీ, న్యూజిలాండ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..  

కెప్టెన్‌గా 38 టెస్టులు ఆడిన కేన్ విలియంసన్, 22 విజయాలు అందుకున్నాడు. ‘బ్లాక్‌క్యాప్స్‌కి టెస్టు క్రికెట్‌లో కెప్టెన్సీ చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నాకు టెస్టు క్రికెట్ చాలా ఇష్టం. మిగిలిన ఫార్మాట్‌ల కంటే టెస్టుల్లో టీమ్‌ని నడిపించడాన్ని చాలా ఎంజాయ్ చేశా...

అయితే కెప్టెన్సీ వల్ల వర్క్‌లోడ్ పెరుగుతోంది. ఈ వయసులో ఇంకా ఆ భారాన్ని మోస్తూ ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నా...  అయితే వచ్చే రెండేళ్లలో రెండు వరల్డ్ కప్స్‌ ఉన్న కారణంగా వైట్ బాల్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగుతాను..’ అంటూ చెప్పుకొచ్చాడు కేన్ విలియంసన్.. 

ద్వైపాక్షిక సిరీసుల్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడం న్యూజిలాండ్ స్పెషాలిటీ. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరుతున్నా 2015, 2019, 2021 వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్ మాత్రం గెలవలేకపోయింది న్యూజిలాండ్.

అయితే గత ఏడాది టీమిండియాని ఓడించి, 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్, 21 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ని కైవసం చేసుకుంది. అయితే 2021-23 సీజన్‌లో 9 టెస్టులు ఆడిన న్యూజిలాండ్, రెండంటే రెండు విజయాలు అందుకుని... 6 మ్యాచుల్లో ఓడింది. టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆఖరి వికెట్ కాపాడుకుని డ్రా చేసుకోగలిగింది...

ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. కేన్ విలియంసన్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ చేరింది న్యూజిలాండ్. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కేన్ విలియంసన్ కెప్టెన్సీలోనే ఆడనుంది న్యూజిలాండ్... 

click me!