
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కొనసాగుతున్న వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకొని అంబుడ్స్మెన్ రాజీనామా వరకు వెళ్ళింది. ఈనెల 14న 85వ ఏజీఎం ముగియగానే అజర్ పంపిన ఈ మెయిల్ ఆధారంగా అంబుడ్స్మెన్ గా బాధ్యతలు స్వీకరించినట్టు తెలిపిన దీపక్ వర్మ హఠాత్తుగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అజర్ కు దీపక్ ఈమెయిల్ ద్వారా తెలియజేసారు. దీనితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
85వ ఏజీఎంలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో అంబుడ్స్మెన్, ఎథిక్స్ ఆఫీసర్ గా ఇద్దరూ రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించినట్టు హెచ్ సీఏ సెక్రటరీ విజయానంద్ నుంచి తనకు లేఖ అందిందని దీపక్ వర్మ అజర్ కు పంపించిన ఈ మెయిల్ లో తెలియజేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్న ఈ సమయంలో తాను అంబుడ్స్మన్ గా కొనసాగలేనని.. రెండు వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయాల్లో తనని దయచేసి మధ్యలోకి లాగొద్దని దీపక్ వర్మ అజర్ కి ఈమెయిల్ పంపారు.
ఇకపోతే అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు, ఆర్థిక అవకతవకల్లో నిండా మునిగి ఉన్న హెచ్‌సీఏ.. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై మరిన్ని వివాదాలకు ఆజ్యం పోసింది.
గత ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏజీఎం గందరగోళ పరిస్థితులకు దారితీసింది. హైకోర్టు తీర్పుతో జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్టు ఏజీఎంలో అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తేల్చాడు. బీసీసీఐలో హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహరుద్దీన్‌ను తనను తాను ప్రకటించుకున్నాడు.
అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకంపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు హైకోర్టు తీర్పుపై నిరసన సైతం వ్యక్తం చేసారు. అనంతరం అజహరుద్దీన్ ప్రమేయం లేకుండానే కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్‌లు ఏజీఎం పేరిటి మరో సమావేశం నిర్వహించారు.
అజహరుద్దీన్ ప్రమేమం లేకుండా సాగిన మరో సమావేశంలో హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ మీనా కుమారిలను నియమించారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌కు ఇచ్చిన జీత భత్యాలనే ఇద్దరికీ ఇవ్వనున్నట్టు తెలిపైన విషయం విదితమే..!