
ఐపీఎల్-2022 లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్. గత మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికారేసి సెంచరీ చేసిన బట్లర్.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కూ అదే సీడీ రిపీట్ మోడ్ లో పెట్టి చూపించాడు. 65 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్సర్లతో వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో అతడికి ఇది మూడో సెంచరీ కాగా ఐపీఎల్ లో మొత్తంగా నాలుగోది. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఆఖరి మ్యాచ్ (రాజస్తాన్ కు) లో సెంచరీతో కదం తొక్కిన అతడు.. ఈ సీజన్ లో అదే జోరును కొనసాగిస్తూ 3 సెంచరీలు చేశాడు. అయితే ఈ సీజన్ లో భీకర ఫామ్ లో ఉన్న బట్లర్.. ఏకంగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి రికార్డులకే ఎసరుపెట్టాడు.
ఒక ఐపీఎల్ సీజన్ లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి ముందున్నాడు. 2016లో కోహ్లి తన కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉండేవాడు. ఆ ఏడాది 16 మ్యాచులాడిన కోహ్లి.. నాలుగు సెంచరీలు సాధించాడు.
ఒక సీజన్ లో నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లిదే రికార్డు. అయితే ఇప్పుడు బట్లర్ ఆ దారిలో ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ ను చూస్తే బట్లర్ కు మరో సెంచరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బట్లర్ ను చూస్తే అప్పటి కోహ్లి ఫామ్ లా అనిపించడం మాత్రమే కాదు ఇద్దరి మధ్య చాలా దగ్గరిపోలికలు కూడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.
- 2016 లో తొలి ఏడు మ్యాచులు ముగిసేసరికి కోహ్లి 433 పరుగులు చేశాడు.
- 2022 లో ఏడు మ్యాచులు ఆడేసరికి బట్లర్.. 491 పరుగులు సాధించాడు.
- విరాట్ కోహ్లి అప్పటికీ (ఏడు మ్యాచులలో) ఒక సెంచరీ మాత్రమే చేస్తే బట్లర్ ఇప్పటికే 3 శతకాలు బాదాడు.
- ఇక తర్వాత 9 మ్యాచుల (మొత్తం 16) లో కోహ్లి.. 540 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. మరి బట్లర్ ఎన్ని చేస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
- మొత్తంగా ఆ సీజన్ లో విరాట్.. 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ - 14 సీజన్లలో ఒక్క సీజన్ లో అన్ని పరుగులు చేసిన ఆటగాడు మరొకరు లేరు. ఇందులో మొత్తంగా 4 సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలున్నాయి.
- ఇక ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్ లలో బట్లర్.. 491 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి.
బట్లర్ ఇలా..
గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తో కలుపుకుని గడిచిన 8 ఇన్నింగ్స్ లలో బట్లర్ స్కోర్లు ఇలా ఉన్నాయి. 124, 35, 100, 70, 13, 54, 103, 116. ఈ సీజన్లలో ముంబై పై తొలి శతకం బాదిన బట్లర్.. కేకేఆర్, ఢిల్లీలపై సెంచరీలు చేశాడు.
కోహ్లి కథ ఇది..
ఇక 2016లో కోహ్లి.. తొలి వంద గుజరాత్ లయన్స్ (100 నాటౌట్) పై చేయగా.. తర్వాత మూడు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (108 నాటౌట్), గుజరాత్ లయన్స్ (109), కింగ్స్ లెవెన్ పంజాబ్ (113) పై సాధించాడు.
సెంచరీల సంగతి పక్కనబెడితే బట్లర్ ఈ సీజన్ లో కోహ్లి 973 పరుగుల రికార్డు కూడా బద్దలు కొట్టే ప్రమాదంలో ఉందని అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏడు మ్యాచులలో 491 పరుగులు చేసిన బట్లర్ కు మిగిలిన మ్యాచుల (ప్లేఆఫ్స్ సంగతి పక్కనబెడితే రాజస్తాన్ ఈ సీజన్ లో ఇంకా 7 మ్యాచులు ఆడుతుంది) లో మరో 474 పరుగులు చేయడం కష్టతరమా..? అదే జరిగితే ఐపీఎల్ లో ఆరేండ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు బీటలు వారినట్టే..