Jasprit Bumrah: మూడు రోజుల సస్పెన్స్ కు తెర.. బుమ్రానే కెప్టెన్.. రోహిత్ ఔట్

By Srinivas MFirst Published Jun 30, 2022, 6:58 PM IST
Highlights

India vs England 5th Test: టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో బీసీసీఐ.. యువ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే భారత జట్టు సారథిగా నియమించింది. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 
 

శుక్రవారం నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ప్రారంభం కాబోయే ఐదో టెస్టు నుంచి  టీమిండియా రెగ్యులర్ కెప్టెన్  రోహిత్ శర్మ తప్పుకున్నాడు. కరోనా నుంచి ఇంకా అతడు కోలుకోకపోవడంతో  అతడి స్థానంలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. బీసీసీఐ ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. తద్వారా  మూడు రోజులుగా రోజుకో మలుపు, గంటకో పేరు చొప్పున నడుస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. బుమ్రా సారథిగా వ్యవహరించనున్న ఈ టెస్టులో అతడి డిప్యూటీ (వైస్ కెప్టెన్) గా రిషభ్ పంత్ ఉంటాడు. 

బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో.. ‘రోహిత్ శర్మ ఇంకా  కరోనా నుంచి కోలుకోలేదు. గురువారం ఉదయం చేసిన రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కూడా అతడికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు రేపట్నుంచి ఇంగ్లాండ్ తో జరుగబోయే టెస్టుకు అందుబాటులో ఉండడు.  ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ స్థానంలో బుమ్రా ను కెప్టెన్ గా నియమించింది. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు..’ అని  పేర్కొంది. 

గత ఆదివారం రోహిత్ కు కరోనా నిర్ధారణ కావడంతో  అతడు అప్పట్నుంచి ఐసోలేషన్ లో గడుపుతున్నాడు.  బుధవారం, గురువారం వరకైనా అతడు కోలుకుంటాడని.. టీమిండియాను నడిపిస్తాడని సెలక్టర్లు ఆశించారు. కానీ  రోహిత్ మాత్రం ఇంకా కోలుకోకపోవడంతో  బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. బుమ్రా కంటే ముందు కెప్టెన్సీ రేసులో రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ ల పేర్లు కూడా వినిపించాయి. కానీ సెలక్టర్లు మాత్రం సంచలనాలకు తావివ్వకుండా బుమ్రాను సారథిగా నియమించారు. 

 

NEWS 🚨 - to lead in the fifth Test Match against England. will be the vice-captain for the match. pic.twitter.com/ueWXfOMz1L

— BCCI (@BCCI)

కపిల్ దేవ్ సరసన.. 

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో కపిల్ దేవ్ తర్వాత  టీమిండియా సారథ్యం పగ్గాలు చేపట్టిన బౌలర్ గా బుమ్రా చరిత్ర పుటల్లోకెక్కాడు. కపిల్ దేవ్.. 1983 నుంచి 1987  వరకు భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.  సారథిగా 34 మ్యాచులకు ఉన్న కపిల్ దేవ్.. 4 మ్యాచుల్లో గెలిచి ఏడు మ్యాచుల్లో ఓడాడు. 22 మ్యాచులు డ్రా గా ముగిశాయి. 35 ఏండ్ల తర్వాత ఆ బాధ్యతలు తీసుకుంటున్న పేస్ గుర్రం బుమ్రా ఏ మేరకు విజయవంతమవుతాడో తేలాల్సి ఉంది. 

రోహిత్ సారథిగా అయ్యాక మారిన కెప్లెన్లు : 

- టీ20 ప్రపంచకప్ తర్వాత  విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ లో సారథిగా తప్పుకోవడంతో హిట్ మ్యాన్ టీమిండియా పగ్గాలు చేపట్టాడు. నవంబర్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో మూడు సిరీస్ లు ఆడింది. ఆ సిరీస్ లో రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఆ తర్వాత.. కివీస్ తో రెండు టెస్టులకు ఒకదాంట్లో అజింక్యా రహానే, మరొక దానికి కోహ్లి కెప్టెన్ గా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టులకు విరాట్ కోహ్లి (రెండో టెస్టుకు కెఎల్ రాహుల్) సారథ్యం వహించి మూడో టెస్టు తర్వాత టెస్టు సారథ్యానికి కూడా గుడ్ బై చెప్పాడు. 
- సౌతాఫ్రికా లో వన్డేలకు  కెప్టెన్ గా కెఎల్ రాహుల్ 
- ఇటీవలే స్వదేశంలో ముగిసిన సఫారీ సిరీస్ కు రిషభ్ పంత్ 
- ఐర్లాండ్ సిరీస్ కు హార్ధిక్ పాండ్యా 
- ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా (గడిచిన టీమిండియాకు సారథిగా వహించిన ఏడో ఆటగాడు బుమ్రా) 

click me!