బుమ్రాకు సర్జరీ విజయవంతం.. కానీ ఆసియా కప్ వరకూ అనుమానమే..

Published : Mar 08, 2023, 07:25 PM IST
బుమ్రాకు  సర్జరీ విజయవంతం.. కానీ ఆసియా కప్ వరకూ అనుమానమే..

సారాంశం

Jasprit Bumrah Surgery: వెన్నునొప్పితో బాధపడుతున్న  టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే సర్జరీ కోసం  న్యూజిలాండ్ వెళ్లాడు.   బుమ్రాకు సర్జరీ పూర్తయినట్టు సమాచారం. 

గత ఆరేడు నెలలుగా  వెన్నునొప్పితో బాధపడుతున్న భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్   జస్ప్రీత్ బుమ్రా  ఇటీవలే   ఆపరేషన్ కోసం  న్యూజిలాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజా రిపోర్టుల ప్రకారం   న్యూజిలాండ్ లో  బుమ్రాకు నిర్వహించిన సర్జరీ విజయవంతమైందని తెలుస్తున్నది.  

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో వచ్చిన సమాచారం మేరకు.. న్యూజిలాండ్ మాజీ పేసర్  షేన్ బాండ్, ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లకు గతంలో సర్జరీ నిర్వహించిన డాక్టర్ రోవన్ షౌటెన్  బుమ్రాకు కూడా ఆపరేషన్ చేశాడు.  బుమ్రా సర్జరీ కూడా అనుకున్నట్టుగానే విజయవంతం అయిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

కొద్దిరోజుల క్రితమే  బుమ్రాను  జాతీయ క్రికెట్ అకాడమీలో  వైద్య నిపుణుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించగా  అతడి వెన్నులో ఇంకా  చిన్న గాయం ఉందని, దానివల్లే అతడు తరుచూ  గాయాల పాలై జట్టుకు దూరంగా ఉంటున్నాడని తేలింది. దీనికి సర్జరీ తప్పదని..  ఆదమరిస్తే భవిష్యత్ లో  మరోసారి కీలక టోర్నీలకు బుమ్రా దూరంగా ఉండాల్సి వస్తుందని బీసీసీఐ భావించింది.  అందుకే బుమ్రాను హుటాహుటిన సర్జరీకోసం  న్యూజిలాండ్ కు పంపిన విషయం తెలిసిందే. 

సర్జరీ విజయవంతం అయినా  బుమ్రా కోలుకోవడానికి కనీసం ఐదు నుంచి ఆరు నెలల సమయం పట్టొచ్చని అంచనా. అన్నీ అనుకూలించి బుమ్రా ఫిట్నెస్ సాధిస్తే  ఆగస్టు మాసాంతం వరకూ లేదా సెప్టెంబర్ లో గానీ అతడు తిరిగి టీమ్ తో కలిసే అవకాశముంది.  సెప్టెంబర్ లో ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీ వరకైనా బుమ్రా తిరిగివస్తాడని  బీసీసీఐ  ఆశలు పెట్టుకుంది.  ఒకవేళ  ఆసియా కప్ కు దూరమైనా   బుమ్రా.. అక్టోబర్ -నవంబర్ లో జరుగబోయే  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వరకు ఎలాగైనా ఫిట్నెస్ సాధించాలని బీసీసీఐతో పాటు టీమిండియా, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  

 

గత ఆగస్టులో ఆసియా కప్ కు ముందే గాయపడ్డ బుమ్రా..  సెప్టెంబర్ లో   ఆస్ట్రేలియా టూర్  లో ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ మళ్లీ గాయం తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్ కు దూరమయ్యాడు. మళ్లీ  జనవరిలో  టీమ్ లోకి వచ్చినా  ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే  ఎన్సీఏకు చేరిన విషయం తెలిసిందే. గాయం కారణంగా బుమ్రా ఈ నెల చివరి నుంచి జరుగబోయే  ఐపీఎల్ తో పాటు జూన్ లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో (భారత్ అర్హత సాధిస్తే)   కూడా ఆడేందుకు  అవకాశం కోల్పోయాడు. ఐపీఎల్ లో  బుమ్రా రిప్లేస్మెంట్ గా ముంబై  ఇండియన్స్  సందీప్ శర్మను తీసుకున్న విషయం విదితమే. 

 

PREV
click me!

Recommended Stories

టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !