
ఇరు జట్ల నిండా ఆల్ రౌండర్లు, స్టార్ బ్యాటర్లు, ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో పరాజయం పాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ నేడు ఢీకొనబోతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ ఓడి తొలుత బౌలింగ్ కు రానుంది. స్నేహ్ రాణా సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
డబ్ల్యూపీఎల్ లో తొలిసారిగా ఆడబోతున్న ఈ రెండు జట్లకూ నేటి మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచి ముందడుగు వేస్తేనే ఆ జట్లకు ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో నేటి పోరును రెండు జట్లూ సీరియస్ గా తీసుకున్నాయి.
కాగా ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ ఇంకా కోలుకోలేదు. దీంతో స్నేహ్ రాణానే ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తోంది. గుజరాత్ టీమ్ లో ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ డంక్లీ, కిమ్ గార్త్ వంటి స్టార్ ఆల్ రౌండర్లు ఉన్నా వాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. బౌలింగ్ లో ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం గుజారత్ దారుణంగా విఫలమవుతున్నది. నేటి మ్యాచ్ లో అయినా ఆ జట్టు రాణిస్తేనే సీజన్ లో గుజరాత్ కు ముందడుగు వేసే అవకాశముంటుంది.
ఇక స్మృతి మంధాన, ఎలీస్ పెర్రీ, హీథర్ నైట్, సోఫీ డివైన్, రిచా ఘోష్, మేగన్, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఆర్సీబీ సొంతం. కానీ గత రెండు మ్యాచ్ లలో ఆ జట్టు బ్యాటింగ్ పేలవం. ఓపెనర్లు తొలి మూడు, నాలుగు ఓవర్ల పాటు మెరుపులు మెరిపించి తర్వాత వెనుదిరుగుతున్నారు. మంచి శుభారంభాలు దక్కకపోవడంతో ఆ తర్వాత వచ్చే మిడిలార్డర్ బ్యాటర్లు కూడా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. మరి నేటి మ్యాచ్ లో ఆర్సీబీ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.
తుది జట్లు : గుజరాత్ జట్టులో మార్పులేమీ లేవు. గత మ్యాచ్ లో ఆడిన టీమ్ తోనే నేడు ఆ జట్టు బరిలోకి దిగుతోంది. ఆర్సీబీలో మాత్రం దిశా కసత్ స్థానంలో పూనమ్ ఖేమన్ర్ తుది జట్టులోకి వచ్చింది.
గుజరాత్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లీ, సుష్మా వర్మ, ఆష్లే గార్డ్‌నర్, హేమలత, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా (కెప్టెన్), కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డెవిన్, ఎలీస్ పెర్రీ, పూనమ్ ఖేమ్నర్, రిచా ఘోష్, హీథర్ నైట్, కనిక అహుజా, మేగన్, శ్రేయాంక పాటిల్, ప్రీతి బోస్, రేణుకా సింగ్ ఠాకూర్