
ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య వారం రోజుల క్రిత జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో తలెత్తిన నో బాల్ వివాదంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిషభ్ పంత్ గానీ, ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే గానీ అలా చేసి ఉండకూడదని కామెంట్స్ చేశాడు. అయితే ఈ విషయంలో ఐసీసీ నిబంధనలను కూడా మార్చాల్సిన అవసరం ఉందని అతడు చెప్పుకొచ్చాడు. ఈ తరహా నో బాల్ ను థర్డ్ అంపైర్ కు సూచించాలని, ఆ విధంగా నిబంధనలను మార్చాలని తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.
మహేళ మాట్లాడుతూ.. ‘ఆట మధ్యలో జోక్యం చేసుకోవడం అనేది నిరాశపరిచింది. అయితే ఆటలో ఎమోషన్స్ అనేది కామన్. మీరు గెలవడానికి దగ్గరగా ఉన్న మ్యాచ్ లో మీకు ఒక తప్పు జరిగినప్పుడు ఆ స్థాయిలో భావోద్వేగాలు ఉండటం కూడా సహజమే. వాళ్లకు గెలవడానికి ఒక అవకాశమైతే వచ్చింది.
కానీ అక్కడ అంపైర్లు తప్పు చేశారని అనుకున్నా నిబంధనలైతే వారికి అనుకూలంగా లేవు. నడుము ఎత్తులో నో బాల్ వచ్చినప్పుడు దానిని థర్డ్ అంపైర్ కు ఇచ్చి సమీక్ష కోరే అవకాశం లేదు. ఆ సమయంలో ఫీల్డ్ లో ఉన్న అంపైర్లు తీసుకునేదే తుది నిర్ణయం. నిబంధనలు అందుకు సమ్మతించవు. దీనిపై ఐసీసీ దృష్టి సారించాలి..’ అని తెలిపాడు.
రిషభ్ పంత్, ప్రవీణ్ ఆమ్రే, శార్దూల్ ఠాకూర్ ల వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘ఒక కోచ్ (ప్రవీణ్) ఫీల్డ్ లోకి వచ్చి అంపైర్ తో వాగ్వాదానికి దిగడమనేది ఆటకు మంచిదికాదు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి విషయాల్లో అసలు ఫీల్డ్ లోకి అడుగుపెట్టడమనే అవకాశం ఆటగాళ్లకు గానీ, కోచ్ లకు గానీ ఉండకూడదు. ఐపీఎల్ లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో మాత్రమే ఫీల్డ్ లోకి వచ్చే ఆస్కారముంది. దానిని అలాగే కొనసాగించాలి.
ఈ మ్యాచ్ ను మేము టీవీలో చూశాం. రిషభ్, ప్రవీణ్, శార్డూల్ ల తీరు చూసి షాక్ కు గురయ్యాం. తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము (ముంబై) కూడా ఇలాగే రియాక్ట్ అయ్యేవాళ్లం. కానీ ఫీల్డ్ లోకి వెళ్లడం అనేది ఆప్షన్ కాదు. అయితే ఇక్కడ రిషభ్, ఆమ్రే తాము చేసిన దానికి కచ్చితంగా బాధపడుంటారు. ఇవన్నీ ఆటలో సహజం. రిషభ్ అసహనంలో న్యాయముంది..’ అని అన్నాడు.
రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్బంగా ఢిల్లీ ఆఖరి ఓవర్లో 36 పరుగులు చేయాల్సి ఉండగా.. ఢిల్లీ బ్యాటర్ రొవ్మెన్ పావెల్ వరుసగా 3 బంతుల్లో సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతి నోబాల్ గా వచ్చిన అంపైర్ మాత్రం దానిని అలా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ డగౌట్ వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. రిషభ్ పంత్.. ఆటగాళ్లను క్రీజు వదిలి రావాలని పిలవడం.. ప్రవీణ్ ఆమ్రే ఫీల్డ్ లోకి వెళ్లడం, శార్దూల్ ఠాకూర్ ఫీల్డ్ అంపైర్ తో వాదులాడటం జరిగాయి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంది. రిషభ్ మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించగా.. శార్దూల్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కట్ చేసింది. ప్రవీణ్ ఆమ్రే కు మ్యాచ్ ఫీజుతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది.