
దేశవాళీ టోర్నీల్లో ఆడలన్నా, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలన్నా... యో-యో టెస్టుతో 2 కి.మీ.ల ఫిట్‌నెస్ టెస్టును నిరూపించుకోవాల్సిందేనంటూ బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి జట్టు ఎంపిక ముందు కొందరు యువ ఆటగాళ్లకు బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించింది బీసీసీఐ.
ఈ పరీక్షల్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీశ్ రాణా, రాహుల్ తెవాటియా, సిద్ధార్థ్ కౌల్, జయ్‌దేవ్ ఉనద్కడ్ ఫెయిల్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే 2 కి.మీ.ల ఫిట్‌నెస్ రన్ టెస్టు ఫెయిల్ అయినట్టు వచ్చిన వార్తలను ఖండించాడు యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్.
ట్రైయినర్ వివేక్ రామకృష్ణన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసిన ఇషాన్ కిషన్, తనతో పాటు జయ్‌దేవ్ ఉనద్కడ్, సిద్ధార్థ్ కౌల్ కూడా టెస్టు పాస్ అయినట్టు తెలిపాడు. అయితే వీరితో పాటు సంజూ శాంసన్ కూడా రెండోసారి నిర్వహించిన పరీక్షలో పాస్ అయినట్టు సమాచారం. ఫిట్‌నెస్ రన్ టెస్టు పూర్తిచేసిన సంజూ శాంసన్, విజయ్ హాజరే ట్రోఫీలో పాల్గొనబోతున్నాడు.