IPL2022 KKR vs SRH: గెలిచి నిలిచిన కేకేఆర్... సన్‌రైజర్స్‌కి వరుసగా ఐదో ఓటమి...

By Chinthakindhi RamuFirst Published May 14, 2022, 11:13 PM IST
Highlights

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలు నిలుపుకున్న కేకేఆర్... వరుసగా ఐదో ఓటమి ఎదుర్కొని ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్‌...

IPL2022 KKR vs SRH: లేటుగా అయినా కేకేఆర్ విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం అందుకుంది గత సీజన్ రన్నరప్ కేకేఆర్. ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్... వరుసగా ఐదో పరాజయాన్ని కూడా అందుకుంది. 

178 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌, 20 ఓవర్లలో 123 పరుగులకి పరిమితమై 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.మరోసారి సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియంసన్ జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. ఓ ఎండ్‌లో అభిషేక్ శర్మ దూకుడుగా బౌండరీలు బాదుతున్నా అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికి కూడా తెగ ఇబ్బందిపడ్డాడు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్...

17 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ని ఆండ్రే రస్సెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

నికోలస్ పూరన్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 3 సిక్సర్లతో 32 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 99 పరుగులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ సగం జట్టు పెవిలియన్‌కి చేరింది...

విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 78 పరుగులు కావాల్సిన దశలో 16వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత టిమ్ సౌథా వేసిన 17వ ఓవర్‌లో 6 పరుగులే రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖరారైపోయింది...

9 బంతుల్లో 4 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, రస్సెల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో మార్కో జాన్సెస్, సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  భువనేశ్వర్ కుమార్ 7, ఉమ్రాన్ మాలిక్ 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్...  సామ్ బిల్లింగ్స్, ఆండ్రే రస్సెల్ అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేయగలిగింది..6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ని మార్కో జాన్సెన్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది కేకేఆర్. అజింకా రహానే, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

నితీశ్ రాణా 16 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 24 బంతుల్లో 3 సిక్సర్లతో 28 పరుగులు చేసిన అజింకా రహానే కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లోనే శశాంక్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

రింకూ సింగ్ 5 పరుగులు చేసి నిరాశపరచడంతో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. 29 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్‌ని భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చగా ఆండ్రే రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

వాషింగ్టన్ సుందర్ వేసిన ఆఖరి ఓవర్‌లో 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు ఆండ్రే రస్సెల్. 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు ఆండ్రే రస్సెల్... 

click me!