IPL2022 KKR vs GT: గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ... రస్సెల్ పోరాడినా కేకేఆర్‌కి మరో పరాజయం...

Published : Apr 23, 2022, 07:33 PM ISTUpdated : Apr 23, 2022, 07:36 PM IST
IPL2022 KKR vs GT: గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ... రస్సెల్ పోరాడినా కేకేఆర్‌కి మరో పరాజయం...

సారాంశం

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్... 48 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన ఆండ్రే రస్సెల్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు... 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. సీజన్‌లో ఆరో విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్, పాయింట్ల పట్టికలో మరోసారి టాప్ పొజిషన్‌కి దూసుకెళ్లింది.

157 పరుగుల ఓ సాధారణ లక్ష్యఛేదనలో కేకేఆర్ తడబడింది. సామ్ బిల్లింగ్స్‌ని మొదటి ఓవర్ నాలుగో బంతికే పెవిలియన్ చేర్చాడు మహ్మద్ షమీ. 4 పరుగులు చేసిన బిల్లింగ్స్, సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... 5 పరుగులు చేసిన సునీల్ నరైన్ కూడా షమీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు..

ఆ తర్వాత నితీశ్ రాణా 7 బంతుల్లో 2 పరుగులు చేసి లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన  కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, యశ్ దయాల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కేకేఆర్...

ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచులు అందుకున్న రింకూ సింగ్, 28 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ కూడా యశ్ దయాల్ బౌలింగ్‌లో అవుట్ కాగా 17 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ని రషీద్ ఖాన్ అవుట్ చేశాడు...

ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రషీద్ ఖాన్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా రికార్డును సమం చేశాడు. అమిత్ మిశ్రా 83 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా రషీద్ ఖాన్‌కి ఇది 83వ మ్యాచ్... 

కేకేఆర్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 29 పరుగులు కావాల్సిన దశలో యశ్ దయాల్ వేసిన 19వ ఓవర్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో కోల్‌కత్తా విజయానికి 18 పరుగులు కావాల్సి వచ్చింది. 

అల్జెరీ జోసఫ్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికి భారీ సిక్సర్ బాదాడు ఆండ్రే రస్సెల్. రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన ఆండ్రే రస్సెల్, బౌండరీ లైన్ దగ్గర ఫర్గూసన్ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 25 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రస్సెల్...  దీంతో కేకేఆర్ విజయానికి ఆఖరి 4 బంతుల్లో 12 పరుగులు కావాల్సి వచ్చింది...

నాలుగో బంతికి సింగిల్ తీసి ఉమేశ్ యాదవ్‌కి స్ట్రైయిక్ అందించాడు టిమ్ సౌథీ. ఆ తర్వాత బంతికి 2 పరుగులు రాగా... ఆఖరి రెండు బంతులకు పరుగులు ఇవ్వని అల్జెరీ జోసఫ్, గుజరాత్‌కి విజయాన్ని అందించాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

ఇప్పటిదాకా 34 మ్యాచులు జరగగా ప్రతీ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన కెప్టెన్లు, మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపారు. హార్ధిక్ పాండ్యా ఆ సిస్టమ్‌ని బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో 15 మ్యాచులు ముగిసిన తర్వాత టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఈ సారి ఏకంగా 34 మ్యాచుల తర్వాత హార్ధిక్ పాండ్యా ఆ వరుసను బ్రేక్ చేశాడు...

మొదటి మూడు మ్యాచుల్లో రెండు వరుస 80+ స్కోర్లతో మెప్పించిన శుబ్‌మన్ గిల్ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి నిరాశపరిచాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్...

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి రెండో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా... ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత డేవిడ్ మిల్లర్‌తో కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు హార్ధిక్ పాండ్యా. 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, శివమ్ మావి బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన హార్ధిక్ పాండ్యా... 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

రషీద్ ఖాన్ 2 బంతులాడి డకౌట్ కాగా...  ఇన్నింగ్స్ 20వ ఓవర్ బౌలింగ్ చేసిన ఆండ్రే రస్సెల్ మొదటి 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన అభినవ్ మనోహర్, రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా... ఆ తర్వాతి బంతికి ఫర్గూసన్ కూడా అలాగే రింకూ సింగ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రాహుల్ తెవాటియా 12 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసి రింకూ సింగ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆఖరి బంతికి యష్ దయాల్‌ను డకౌట్ చేశాడు రస్సెల్. ఆఖరి ఓవర్‌లో 5 పరుగులు రాబట్టిన గుజరాత్ టైటాన్స్, ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది.
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు