IPL2022 CSK vs SRH: సీఎస్‌కేకి మూడో విజయం, సన్‌రైజర్స్‌‌పై రివెంజ్ తీర్చుకుంటూ...

By Chinthakindhi RamuFirst Published May 1, 2022, 11:06 PM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్‌కి సీజన్‌లో మూడో విజయం... నాలుగు వికెట్లు తీసిన ముఖేశ్ చౌదరి... భారీ లక్ష్యఛేదనలో పోరాడి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 

రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు కాస్త ఆగాల్సింది. కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన మాహీ, చెన్నై సూపర్ కింగ్స్‌కి సీజన్‌లో మూడో విజయాన్ని అందించాడు. జడ్డూ కాస్త ఆగి ఉంటే, ఈ సక్సెస్ అతని ఖాతాలోకే వెళ్లి ఉండేది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆకట్టుకుని... సీజన్‌లో మూడో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కేకేఆర్‌తో సమానంగా నిలిచింది సీఎస్‌కే... నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా సన్‌రైజర్స్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. 

Latest Videos

203 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 5.4 ఓవర్లలో 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 24 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన అభిషేక్ శర్మను అవుట్ చేసిన ముఖేశ్ చౌదరి, ఆ తర్వాతి బంతికే రాహుల్ త్రిపాఠిని గోల్డెన్ డకౌట్ చేశారు...

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా సన్‌రైజర్స్ స్కోరు వేగం తగ్గలేదు. అయిడిన్ మార్క్‌రమ్ 10 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన కేన్ విలియంసన్, ప్రిటోరియస్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

విలియంసన్ అవుటయ్యే సమయానికి సన్‌రైజర్స్ విజయానికి 34 బంతుల్లో 77 పరుగులు కావాలి. అయితే శశాంక్ సింగ్, నికోలస్ పూరన్ కావాల్సినంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన శశాంక్ సింగ్, ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... ఆ తర్వాత రెండో బంతికే వాషింగ్టన్ సుందర్ కూడా బౌల్డ్ అయ్యాడు...

దీంతో చివరి 2 ఓవర్లలో విజయానికి 50 పరుగులు కావాల్సి వచ్చాయి. ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సార్లు క్యాచ్ డ్రాప్ కావడంతో బతికిపోయిన నికోలస్ పూరన్ ఎంత ప్రయత్నించినా.. ఆ ఓవర్‌లో 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో 38 పరుగులు కావాల్సి రాగా మొదటి రెండు బంతుల్లో 6, 4 బాదిన నికోలస్ పూరన్... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

నికోలస్ పూరన్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్‌లో 24 పరుగుల వచ్చినా 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్..

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది... ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే. తొలి వికెట్‌కి 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, సీఎస్‌కేకి భారీ స్కోరు అందించారు. 
 

కొత్త పెళ్లి కొడుకు డివాన్ కాన్వేతో కలిసి ఓపెనింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆరంభంలో ఆచి తూచి ఆడారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి 40 పరుగులు మాత్రమే చేయగలిగింది సీఎస్‌కే... అయితే ఆ తర్వాత గేరు మార్చిన రుతురాజ్ గైక్వాడ్.. ఉమ్రాన్ మాలిక్, అయిడిన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్‌లను టార్గెట్‌ చేస్తూ బౌండరీల మోత మోగించాడు...  

తొలి వికెట్‌కి 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, సెంచరీకి పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కలిసి నెలకొల్పిన 157 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించింది రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే జోడి...

57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసిన రుతురాజ్, టి నటరాజన్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... సీఎస్‌కే తరుపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కాగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు రుతురాజ్ గైక్వాడ్... 

ఐపీఎల్‌లో 99 పరుగుల వద్ద అవుటైన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, పృథ్వీషా, ఇషాన్ కిషన్, క్రిస్ గేల్... 99 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరారు...

వన్‌డౌన్‌లో వచ్చిన ఎమ్మెస్ ధోనీ 7 బంతుల్లో ఓ ఫోర్ బాది 8 పరుగులు చేసి నట్టూ బౌలింగ్‌లోనే అవుట్ కాగా డివాన్ కాన్వే 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

click me!