
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు పరాజయాలను ఎదుర్కొన్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఎట్టకేలకు గాఢిలో పడ్డట్టే కనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ ఊతప్ప, శివమ్ దూబే కలిసి సీఎస్‌కేకి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోరు అందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత మొయిన్ ఆలీ 8 బంతుల్లో 3 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 6.4 ఓవర్లు ముగిసే సరికి 36 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...
ఆ తర్వాత రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే కలిసి మూడో వికెట్‌కి 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 60 పరుగులు మాత్రమే చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత జోరు పెంచింది. 11, 12వ ఓవర్లలో 13 పరుగులు రాగా 13వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఏకంగా 19 పరుగులు రాబట్టాడు రాబిన్ ఊతప్ప...
14, 15వ ఓవర్లలో కలిపి 5 ఓవర్లలో 73 పరుగులు రాబట్టారు రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే. మహ్మద్ సిరాజ్ వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన రాబిన్ ఊతప్ప 18 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్‌పై ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి 118 పరుగులు జోడించారు. దాన్ని అధిగమించింది ఊతప్ప, శివమ్ దూబే జోడీ...
వికెట్ టేకర్ హర్షల్ పటేల్ లేని లోటు ఆర్‌సీబీ బౌలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. అకాల మరణం చెందిన హర్షల్ పటేల్ సోదరి మృతికి సంతాపంగా నల్ల బ్యాడ్జీలను ధరించి, బరిలో దిగారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ సభ్యులు...
ఆకాశ్ సింగ్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా నాలుగు వైడ్లతో కలిపి 24 పరుగులు రాబట్టాడు శివమ్ దూబే... ఐపీఎల్ చరిత్రలో మూడు అంతకంటే కింద వికెట్లకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు కామెరూన్ వైట్, కుమార సంగర్కర కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 157 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ రికార్డును పదేళ్ల తర్వాత అధిగమించారు దూబే, ఊతప్ప జోడీ...
50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, వానిందు హసరంగ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాబిన్ ఊతప్పకి ఇదే ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు. ఊతప్ప అవుటైన తర్వాతి బంతికే కెప్టెన్ రవీంద్ర జడేజా గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 96 పరుగులు చేసిన శివమ్ దూబే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి భారీ షాక్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 96 పరుగుల వద్ద అవుటైన రెండో ప్లేయర్ శివమ్ దూబే. ఇంతకుముందు శుబ్‌మన్ గిల్ కూడా 96 పరుగులకే అవుట్ అయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు.