
దుబాయ్: సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇన్సింగ్ చివర్లో కేవలం నాలుగుబంతులు మాత్రమే ఆడిన కృనాలు ఏకంగా 500కు పైగా స్ట్రైక్ రేట్ తో 20 పరుగులు చేశాడు. ఇలా ఐపిఎల్ లో కనీసం 10పరుగులు చేసిన ఆటగాళ్లలో 500 స్ట్రైక్ రేట్ కలిగిన తొలి బ్యాట్స్‌మన్‌గా కృనాల్ చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో ముంబై మొదట బ్యాటింగ్ కు దిగగా చివరి ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన కృనాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిద్దార్ కౌల్ విసిరిన మొదటి బంతిని నేరుగా బౌండరీ అవతలికి తరలించి సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాతి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక మూడో బంతి సిక్స్ కొట్టి విజయవంతంగా ఇన్నింగ్స్ ముగించాడు. ఇలా క్రీజులో వున్న కొద్దిసేపట్లోనే పరుగుల సునామీ సృష్టించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కృనాల్.