రోహిత్ సేనతో ఢీ: కెప్టెన్‌గా 150వ టీ20లో కోహ్లీ విజయం సాధిస్తాడా?

By team teluguFirst Published Sep 28, 2020, 10:36 AM IST
Highlights

సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌ను ఆ జట్టు మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం కారణంగా నెగ్గిన బెంగళూర్‌... పంజాబ్‌తో తర్వాతి మ్యాచ్‌లో తన అసలు రంగులు బయటపెట్టుకుంది. విరాట్‌ కోహ్లి జట్టులో అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. 

ఐపీఎల్‌ 2020. కొత్త వాతావరణంలో ధనాధన్‌ లీగ్‌. దేశం మారింది, వేదిక మారిపోయింది. అయినా, అదే ముంబయి ఇండియన్స్‌, అదే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌.
అబుదాబి స్టేడియం వాంఖడే కంటే పెద్ద మైదానం. అయినా, అక్కడ కోల్‌కత నైట్‌రైడర్స్‌పై రోహిత్‌ సేన 195 పరుగులు బాదేసింది. జస్ప్రీత్ బుమ్రా, పాటిన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌లు తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నారు. 

మరోవైపు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ సీజన్‌లో తొలి విజయం గాలి వాటమేనని మరోసారి నిరూపించుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో బెంగళూర్‌ తీవ్రమైన సమస్యలు చవిచూస్తోంది. అన్ని విభాగాల్లో భీకర ఫామ్‌లో ఉన్న ముంబయి ఇండియన్స్‌ నేడు మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

ముంబయి బయటికొచ్చింది!

ముంబయి ఇండియన్స్‌ తొలిసారి ఐపీఎల్‌ 2020లో కొత్త వేదికకు వస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌లతో మ్యాచులను అబుదాబిలోనే ఆడేసింది. సీజన్‌లో మూడో మ్యాచ్‌ను దుబాయ్‌లో ఆడేందుకు సిద్ధమైంది. దుబాయ్‌ పరిస్థితులకు అనుగుణమైన అస్త్రాలు ముంబయి సొంతం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. 

మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ జోరు మీదున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారిలు నిలకడగా రాణిస్తున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో కీరన్‌ పొలార్డ్‌, హార్ధిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యలు మెరిస్తే ముంబయికి ఎదురుండదు. 

బౌలింగ్‌ విభాగంలోనూ నాణ్యమైన పేసర్లతో ముంబయి పటిష్టంగా ఉంది. హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నిరుడు శస్త్రచికిత్స కారణంగా అప్పుడే పాండ్యకు బంతి అందించేందుకు ముంబయి ఆలోచన చేస్తోంది.

బెంగళూర్‌ పుంజుకునేనా?:

సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌ను ఆ జట్టు మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం కారణంగా నెగ్గిన బెంగళూర్‌... పంజాబ్‌తో తర్వాతి మ్యాచ్‌లో తన అసలు రంగులు బయటపెట్టుకుంది. విరాట్‌ కోహ్లి జట్టులో అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. 

ఆరంభ మ్యాచ్‌లో మెరిసిన దేవ్‌దత్‌ పడిక్కల్‌తో కలిసి అరోన్ ఫించ్‌ టాప్‌ ఆర్డర్‌లో బాధ్యత తీసుకుంటే బెంగళూర్‌ మెరుగైన స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. విరాట్‌ కోహ్లి తొలి రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. 

ముఖ్యంగా పంజాబ్‌తో భారీ ఛేదనలో ఐదు బంతులు ఆడిన విరాట్‌ కోహ్లి ఒక్క పరుగైనా చేయకుండానే అవుటయ్యాడు. ఏబీ డివిలియర్స్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ... పరిస్థితులకు తగినట్టు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. 

వికెట్‌ కీపర్‌ జోశ్‌ ఫిలిప్‌ జట్టులో తన స్థానానికి న్యాయం చేయాలని చూస్తున్నాడు. శివం దూబె, వాషింగ్టన్‌ సుందర్‌లు ఆల్‌రౌండర్‌ నైపుణ్యాలు బయటపెడితే బెంగళూర్‌ పని సులువు కానుంది. 

బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతడికి సరైన సహకారం అందటం లేదు. దుబాయ్‌ పిచ్‌పై చాహల్‌ మరోసారి ముంబయికి ప్రమాదకారి కానున్నాడు. క్రిస్‌ మోరీస్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే బెంగళూర్‌కు మరో ఆయుధం దక్కినట్టే. ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు.

విరాట్‌కు కెప్టెన్‌గా 150వ టీ20:

విరాట్‌ కోహ్లికి వ్యక్తిగతంగా ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఓ మైలురాయి. పొట్టి ఫార్మాట్‌లో విరాట్‌కు ఇది150వ టీ20 మ్యాచ్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు 112 టీ20ల్లో, భారత్‌కు 37 టీ20ల్లో సారథ్యం వహించిన విరాట్‌.. నేడు 150వ మ్యాచ్‌లో నాయకత్వం వహించబోతున్నాడు. 

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జాతీయ జట్టు నాయకత్వానికి బలమైన పోటీదారు రోహిత్‌ శర్మతో నేడు కోహ్లి కెప్టెన్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో నాలుగు టైటిళ్లలతో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా దిగ్గజ హోదా పొందాడు. 

ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న విరాట్‌ కోహ్లి.. నేడు ముంబయితో మ్యాచ్‌లో తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేందుకు తహతహ లాడుతున్నాడు.  ముంబయి ఇండియన్స్‌తో చివరి ఐదు మ్యాచుల్లో బెంగళూర్‌ ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. గత సీజన్‌లో బెంగళూర్‌ రెండు మ్యాచులను ముంబయి ఇండియన్స్‌కు కోల్పోయింది.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

ముంబయి ఇండియన్స్‌:  క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారి, కీరన్ పొలార్డ్‌, హార్ధిక్‌ పాండ్య, కృనాల్ పాండ్య, జేమ్స్‌ పాటిన్సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రా

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌: అరోన్ ఫించ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్, జోశ్‌ ఫిలిప్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, డేల్‌ స్టెయిన్‌, ఉమేశ్‌ యాదవ్‌/మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వెంద్ర చాహల్‌, నవదీప్‌ సైని.

click me!
Last Updated Sep 28, 2020, 12:07 PM IST
click me!