
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది లార్జర్ దెన్ లైఫ్ లా అయింది. అది ఎంతమాత్రమూ ఇండియాకు పరిమితం కాదు. మిగతా దేశాలు నిర్వహిస్తున్న లీగ్ లతో పోలిస్తే దాని స్థాయి వేరు.. ఆ స్థానం వేరు అనే రేంజ్ లో తయారైంది దాని విలువ. ఇక మన దాయాది దేశం పాకిస్థాన్ కూడా ఏడేండ్ల క్రితం మొదలుపెట్టిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కూడా ఐపీఎల్ అంత కాకపోయినా దానికుండే క్రేజ్ దానికీ ఉంది. ఈ రెండింటిలో ఏ లీగ్ గొప్ప..? అక్కడ గెలిచిన విజేతలకు ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత..? పీఎస్ఎల్ వాల్యూ ఎంత...? ఇటువంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
నాలుగు రోజుల క్రితమే పీఎస్ఎల్-2022 ఏడో సీజన్ ముగిసింది. గతంలో ట్రోఫీ నెగ్గని లాహోర్ ఖలందర్స్ జట్టు ఈసారి ఛాంపియన్ గా నిలిచింది. గతనెల 27న ముల్తాన్ సుల్తాన్స్ తో జరిగిన ఫైనల్ లో పాకిస్థాన్ సీమర్ షాహీన్ షా అఫ్రిది నేతృత్వంలోని లాహోర్ ఖలందర్స్ గెలిచింది. పీఎస్ఎల్ గెలిచినందుకు గాను లాహోర్ కు వచ్చిన ప్రైజ్ మనీ పాకిస్థాన్ రూపీ 80 మిలియన్లు (రూ. 3.40 కోట్లు).
గతేడాది ఐపీఎల్-2021 సీజన్ లో ఫైనల్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించి ట్రోపీ సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు దక్కిన ప్రైజ్ మనీ రూ. 20 కోట్లు. పీఎస్ఎల్ ప్రైజ్ మనీ తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ.
పీఎస్ఎల్ విజయవంతమైందని.. తన క్రికెట్ కెరీర్ లో మునుపెన్నడూ చూడని విధంగా స్టేడియాల్లోకి జనాలు వచ్చారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కరాచీ, లాహోర్ లలో జరిగిన మ్యాచులలో అయితే జనం ఎగబడి వచ్చారని తద్వారా తమకు ఊహించని ఆదాయం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. పీఎస్ఎల్ 7 లాభాలు 71 శాతం పెరిగాయని.. ప్రతి ఫ్రాంచైజీ సుమారు 900 మిలియన్ల (సుమారు రూ. 4 కోట్లు) ఆదాయం గడించిందని చెప్పాడు.
ఇదిలాఉండగా.. పీఎస్ఎల్ బ్రాండ్ వాల్యూ 300 మిలియన్ల యూఎస్ డాలర్లు (సుమారు రూ. 5,329 కోట్లు) గా ఉంది. అదే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 6.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 47,500 కోట్లు) గా ఉంది. ఇది కూడా 2019 లెక్కలే. ఈసారి రెండు కొత్త జట్లు (లక్నో, గుజరాత్) కూడా వచ్చి చేరాయి. దీంతో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అంతకు రెట్టింపు అయి ఉంటుందని క్రికెట్ పండితులు అంచనాలు కడుతున్నారు. ఇటీవల బెంగళూరు వేదికగా ముగిసిన వేలంతో పాటు రిటెన్షన్ ప్రక్రియలోనే అన్ని జట్లు ఏకంగా రూ. 900 కోట్లు ఖర్చు పెట్టాయి.