ఐపీఎల్‌లోకి నీరజ్ చోప్రాను పట్టుకొచ్చారా.. లేక అతడి బ్రదరా..! ఎవరీ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్..?

Published : Apr 07, 2023, 11:38 AM ISTUpdated : Apr 07, 2023, 11:41 AM IST
ఐపీఎల్‌లోకి నీరజ్ చోప్రాను పట్టుకొచ్చారా.. లేక అతడి బ్రదరా..! ఎవరీ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్..?

సారాంశం

IPL 2023: ఐపీఎల్-16లో భాగంగా  గురువారం  కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగిన  మ్యాచ్ లో   బెంగళూరు కీలక బ్యాటర్లను  ఔట్ చేసిన మిస్టరీ స్పిన్నర్  సుయాశ్ శర్మ గురించి  నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.    

ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్  టీమ్ కు ఓ ప్రత్యేకత ఉంది. మిస్టరీ స్పిన్నర్లను తీసుకురావడంలో వాళ్లది ప్రత్యేక శైలి.  సునీల్ నరైన్ నుంచి మొదలుకుని వరుణ్ చక్రవర్తి వరకూ  ఇది నిరూపితమైంది. తాజాగా  కేకేఆర్ మరో మిస్టరీ స్పిన్నర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.   గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  జరిగిన  మ్యాచ్ లో   కేకేఆర్.. కుడి చేతి వాటం లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మతో మ్యాజిక్ చేసింది. నిన్నటి మ్యాచ్ లో  సుయాశ్.. మూడు  వికెట్లు తీసి  ఆర్సీబీ నడ్డి విరిచాడు. ఇంతకీ ఎవరీ సుయాశ్..? 

చూడటానికి కాస్త అటూ ఇటూగా టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో లో భారత్ కు  స్వర్ణం సాధించిన   నీరజ్ చోప్రా మాదిరిగా ఉన్న ఈ కుర్రాడు  పూర్తిగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఫుల్ ఫేమస్ అయ్యాడు.    చోప్రా మాదిరిగానే జులపాలు,  ఫేస్ కట్, హెయిర్ బ్యాండ్ తో   ఉన్న  సుయాశ్  గురించి ఆసక్తికర విషయాలివిగో.. 

ఢిల్లీ కుర్రాడు.. 

ఆర్సీబీతో  మ్యాచ్ లో   వెంకటేశ్ అయ్యర్ ప్లేస్ లో  ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సుయాశ్ శర్మది ఢిల్లీ.   దేశ రాజధానికి చెందిన ఈ 20 ఏండ్ల  కుర్రాడు (2003 లో పుట్టాడు) ఇంతవరకూ ఢిల్లీ తరఫున ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ గానీ, లిస్ట్ ఏ మ్యాచ్ గానీ  బీసీసీఐ నిర్వహించే  ఏ ఒక్క  టీ20 మ్యాచ్ గానీ ఆడలేదు.  అండర్ -25 స్థాయిలో   క్లబ్ క్రికెట్ ఆడిన అనుభవం తప్ప   సుయాశ్ కు  కాంపిటీటివ్ క్రికెట్ ఆడిన ఎక్స్‌పీరియన్స్ లేదు.  

ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతుండగా  సుయాశ్ గురించి తెలిసిన కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, టీమ్ మేనేజ్మెంట్  వివరాలు ఆరా తీసి అతడిని పట్టుకుంది.   కొచ్చి లో జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని  రూ. 20 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.  ఇతడి గురించి కేకేఆర్ క్యాంప్ నకు వెళ్లేవరకూ ఎవరికీ తెలియదట. అంతెందుకు.. కేకేఆర్ కెప్టెన్ అయిన నితీశ్ రాణా  కూడా ఢిల్లీ వాడే. నితీశ్ కు కూడా  సుయాశ్ ను కేకేఆర్ క్యాంప్ లోనే కలిశాడట. 

 

తన డెబ్యూ మ్యాచ్ లోనే సుయాశ్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్లు వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో.. సుయాశ్ మాత్రం నిన్నటి మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపించాడు. ఆర్సీబీ కీలక బ్యాటర్లు దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్ లను ఔట్ చేశాడు.  చివర్లో కర్ణ్ శర్మ ను కూడా పెవిలియన్ పంపి ఈ మ్యాచ్ లో  3 వికెట్లు తీసుకున్నాడు.   

మ్యాజిక్ చేస్తాడని తెలుసు.. 

సుయాశ్ ప్రదర్శనపై     కేకేఆర్ హెడ్ కోచ్  చంద్రకాంత్ పండిట్ మాట్లాడుతూ..  ‘మేము అతడిని  ట్రయల్ మ్యాచ్ లలో చూసి  ఈ కుర్రాడిలో విషయముందని గ్రహించాం. అతడు బౌలింగ్ చేసే విధానం మమ్మల్ని ఆకట్టుకుంది.  సుయాశ్ వేసే బంతులు చాలా త్వరగా వెళ్లిపోతాయి. బ్యాటర్లకు   వాటిని అంచనా వేసే అవకాశమే ఉండదు.  వాస్తవానికి ఈ మ్యాచ్ కు ముందు అతడికి  కాంపిటీటివ్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు.  కానీ  సుయాశ్ మేం అనుకున్నదానికంటే బాగా రాణించాడు..’అని   చెప్పాడు. 


 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర