
ఐపీఎల్-16 లో ‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ హడావిడి చేస్తున్న ఆర్సీబీకి వరుసగా షాకులు తాకుతున్నాయి. గాయాలు ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఆర్సీబీ కీలక పేసర్ జోష్ హెజిల్వుడ్ గాయం కారణంగా ఇంకా జట్టుతో కలవనప్పటికీ ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టాప్లీతో నెట్టుకొద్దామనుకున్న డుప్లెసిస్ సేనకు ఆ ఆనందం కూడా దక్కలేదు. ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే గాయపడ్డ ఈ ఇంగ్లీష్ పేసర్.. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు పెట్టా బేడా సర్దుకుని నిన్న రాత్రే కోల్కతా నుంచి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు.
ఈ నెల 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ టాప్లీ.. రెండు మూడు మ్యాచ్ లకు దూరమైనా తర్వాత తిరిగి జట్టుతో చేరతాడని ఆర్సీబీ అభిమానులు అనుకుంటున్న తరుణంలో.. అతడు ఏకంగా సీజన్ మొత్తానికి తప్పుకోవడం ఆ జట్టును దెబ్బతీసేదే.
ఎలా జరిగింది..?
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న టాప్లీకి గాయమైంది. ఆర్సీబీ బౌలర్ కర్ణ్ శర్మ వేసిన 8వ ఓవర్లో తిలక్ వర్మ షాట్ ఆడాడు. బౌండరీని సేవ్ చేసే క్రమంలో అతడు ముందుకు డైవ్ చేశాడు. అయితే కిందపడే క్రమంలో టాప్లీ కుడి భుజం బలంగా నేలకు తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడు. అయితే ఫిజియో వచ్చినప్పటికీ టాప్లీ నొప్పి తగ్గకపోగా అతడిని డగౌట్ కు తీసుకెళ్లారు. అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. టాప్లీ కుడి భుజం పక్కటెముకకు గాయమైందని తేలింది.
తప్పుకున్నాడు : బంగర్
టాప్లీకి గాయమైనా అతడు రెండు మూడు మ్యాచ్ లకు మాత్రమే దూరమవుతాడని ఆ తర్వాత తిరిగి కోలుకుంటాడని ఆర్సీబీ అభిమానులు భావించారు. ఆర్సీబీ టీమ్ తో పాటు అతడు కోల్కతాకూ రావడంతో టాప్లీ కోలుకుంటున్నట్టే అనిపించింది. కానీ నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ సందర్బంగా ఆ జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ రీస్ టాప్లీ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. మేం అతడు తిరిగి వచ్చేందుకు చేయగలిగిందంతా చేశాం. అతడికి మెరుగైన చికిత్స అవసరం అని తేలింది. టాప్లీ రిప్లేస్మెంట్ ను త్వరలోనే ప్రకటిస్తాం..’ అని చెప్పాడు.
గాయాల వల్ల ఈ సీజన్ నుంచి తప్పుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు :
- విల్ జాక్స్ (ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా గాయపడి సీజన్ నుంచి తప్పుకున్నాడు)
- రజత్ పాటిదార్ (ఆర్సీబీ ట్రైనింగ్ సెషన్ లో చేతికి గాయమై సీజన్ మొత్తానికి దూరమయ్యాడు)
- రీస్ టాప్లీ (భుజం గాయంతో తప్పుకున్నాడు)
- జోష్ హెజిల్వుడ్ (జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. ఏప్రిల్ 20 తర్వాత ఆర్సీబీతో కలుస్తాడు. కానీ ఎంతవరకు ఫిట్నెస్ సాధిస్తాడు..? అనేది అనుమానమే)