అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లీ.. ఆ ఒక్కటీ ఉంటే ఇంకా అదిరిపోయేది..

Published : Apr 03, 2023, 10:05 AM IST
అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లీ..  ఆ ఒక్కటీ ఉంటే ఇంకా అదిరిపోయేది..

సారాంశం

IPL 2023:నిన్నటి మ్యాచ్ లో   విరాట్ కోహ్లీ..   49 బంతుల్లోనే   6 ఫోర్లు, 5  భారీ సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  చివర్లో కోహ్లీ కొట్టిన సిక్సర్ 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ధోని కొట్టిన సిక్సర్ ను గుర్తు చేసింది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్  లో 16వ ఎడిషన్ ను  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ఆరంభించింది.  బెంగళూరులోని  చిన్నస్వామి స్టేడియంలో   ముంబై ఇండియన్స్ తో  జరిగిన మ్యాచ్ లో    ఆర్సీబీ.. 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని  ఆర్సీబీ ఓపెనర్లు  విరాట్ కోహ్లీ,  కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ‘ఉఫ్’మని ఊదేశారు.  వీరిద్దరి దంచుడుకు  చిన్నస్వామిలో ముంబై స్కోరు మరీ చిన్నదైంది.  

అయితే నిన్నటి మ్యాచ్ లో   విరాట్ కోహ్లీ..   49 బంతుల్లోనే   6 ఫోర్లు, 5  భారీ సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  అర్షద్ ఖాన్ వేసిన  17వ ఓవర్లో రెండో బంతిని  లాంగాన్ మీదుగా  భారీ సిక్సర్ బాదాడు.  ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులకు ఈ సిక్సర్..  2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై ఎంఎస్ ధోని  కొట్టిన సిక్సర్ ను గుర్తు చేసింది. 

యాధృశ్చికమో ఏమో గానీ  సరిగ్గా  12 ఏండ్ల క్రితం  భారత జట్టు.. ఏప్రిల్ 2నే   వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.  ఆదివారం భారత క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా దిగ్గజం  సచిన్ టెండూల్కర్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ   వరల్డ్ కప్ మధురానుభూతులను పంచుకున్నాడు.   ఈ మ్యాచ్ లో  నువాన్ కులశేఖర వేసిన  49వ ఓవర్ రెండో బంతికి  ధోని.. లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన సందర్భాన్ని  భారత క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మరిచిపోరు. 

 

సరిగ్గా 12 ఏండ్ల తర్వాత  కోహ్లీ.. ముంబైపై  అచ్చు ధోని కొట్టినట్టే  సిక్సర్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. దీంతో   కోహ్లీ అభిమానులు.. ధోని-కోహ్లీలు కొట్టిన షాట్ ను   పోల్చుతూ సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు.  అయితే  ధోని ఆ షాట్ కొట్టినప్పుడు   రవిశాస్త్రి చెప్పిన కామెంట్రీ  మరో లెవల్ లో ఉంది.  కానీ నిన్నటి  మ్యాచ్ లో  అది మిస్ అయింది.  శాస్త్రి గనక  కామెంట్రీకి వచ్చుంటే  అది వేరే లెవల్ లో ఉండేది అంటున్నారు అభిమానులు. మరికొందరు మాత్రం  కోహ్లీ ఈ సిక్సర్ ద్వారా   2011 వన్డే వరల్డ్ కప్ విజయానికి ట్రిబ్యూట్ ఇచ్చాడని కామెంట్ చేస్తున్నారు.  ప్రస్తుతం  ధోని వరల్డ్ కప్ మ్యాచ్ విక్టరీ, కోహ్లీ ఆర్సీబీ  విన్నింగ్ సిక్స్ లు  నెట్టింట వైరల్ గా మారాయి. 

 

ఇక ఆర్సీబీ-ముంబై మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై .. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  171 పరుగులు చేసింది.  తెలుగు కుర్రాడు తిలక్ వర్మ  (46 బంతుల్లో  84 నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు)  మెరుపులు లేకుంటే ముంబై ఆ స్కోరు చేసేది కాదు.  లక్ష్య ఛేదనలో    ఆర్సీబీ.. ముంబై బౌలర్లను ఉతికారేసింది.  ఒకదశలో ఓపెనర్లు  డుప్లెసిస్-కోహ్లీలే మ్యాచ్ ను గెలిపిస్తారా..? అనిపించింది.  తొలి వికెట్ కు  ఈ ఇద్దరూ  ఏకంగా 148 పరుగులు జోడించారు.  తర్వాత ఫాఫ్ అవుట్ అయినా  కోహ్లీ.. మిగతా పనిని పూర్తి చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?