శుబ్‌మన్ గిల్ రికార్డు సెంచరీ, క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు... ముంబై ఇండియన్స్‌కి...

By Chinthakindhi RamuFirst Published May 26, 2023, 9:57 PM IST
Highlights

IPL 2023 సీజన్‌లో మూడో సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్... 233 పరుగుల భారీ స్కోరు చేసిన గుజరాత్ టైటాన్స్... 

దంచి కొట్టుడు, ఊరకొట్టుడు, మాస్ కొట్టుడు, చితక్కొట్టుడు... ఈ పదాలకు పర్యాయ పదంగా శుబ్‌మన్ గిల్, ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ని అభివర్ణించవచ్చు. ఫోర్లు బాదడం కంటే సిక్సర్లు కొట్టడమే ఈజీ అన్నట్టుగా బౌండరీల వర్షం కురిపించిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో సెంచరీ బాది, రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. గిల్ సంచలన ప్రదర్శన కారణంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు చేసింది...

క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని టిమ్ డేవిడ్ జారవిడిచాడు. అప్పటికి 30 పరుగులు మాత్రమే చేసిన శుబ్‌మన్ గిల్ ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు... 

తొలి వికెట్‌కి వృద్ధిమాన్ సాహాతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం జోడించిన శుబ్‌మన్ గిల్,  మరోసారి తిలక్ వర్మ క్యాచ్ మిస్ చేయడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు..

49 బంతుల్లో సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచాడు. ఈ సీజన్‌లో శుబ్‌మన్ గిల్‌కి ఇది మూడో సెంచరీ. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండో సెంచరీ బాది ఆ టీమ్‌ ప్లేఆఫ్స్ ఛాన్సులపై నీళ్లు చల్లాడు..

ఒకే సీజన్‌లో మూడు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ శుబ్‌మన్ గిల్. విరాట్ కోహ్లీ 2016లో 4 సెంచరీలు బాదగా, గత ఏడాది జోస్ బట్లర్ 4 సెంచరీలు చేశాడు..

2023 సీజన్‌లో 800+ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 800+లకు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 976 పరుగులు చేసి, టాప్‌లో ఉన్నాడు.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్న డివాన్ కాన్వే కంటే దాదాపు 200 పరుగుల దూరంలో ఉన్నాడు శుబ్‌మన్ గిల్. ఫైనల్ మ్యాచ్‌లో కాన్వే సెంచరీ చేసినా గిల్, ఆరెంజ్ క్యాప్ గెలవడం దాదాపు ఖాయమే..  

60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆకాశ్ మద్వాల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన సాయి సుదర్శన్, ఆఖరి ఓవర్‌లో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు.. రషీద్ ఖాన్ 5 పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. 

click me!