‘ప్రభావం’ ఏమో గానీ ‘పరాభవాల’కు కారణమవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్లు..

Published : Apr 03, 2023, 11:44 AM IST
‘ప్రభావం’ ఏమో గానీ ‘పరాభవాల’కు కారణమవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్లు..

సారాంశం

IPL 2023: ఐపీఎల్ - 2023 సీజన్  లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’.  ఈ సీజన్ నుంచి  ‘గేమ్ ఛేంజర్’  అవుతుందని విశ్లేషణలు వ్యక్తమవుతున్న ఈ నిబంధన  జట్లకు మేలు చేస్తుందా..? 

ఇండియన్  ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది నుంచి  కొత్తగా అందుబాటులోకి వచ్చిన   ఇంపాక్ట్ ప్లేయర్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సింపుల్ గా చెప్పాలంటే  ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న  క్రమంలో ఎప్పుడైనా ఒక ఆటగాడిని మార్చి  మరో ఆటగాడిని ఫీల్డ్ లోకి తీసుకోవచ్చు.  అయితే ఈ నిబంధనను వివిధ జట్లు వివిధ రూపాల్లో  వాడుతున్నాయి.   తొలుత బ్యాటింగ్ చేసే జట్టు ఒక బ్యాటర్ ను  వాడి  ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బౌలర్ కు ఛాన్స్ ఇస్తున్నాయి.  ఇక తొలుత బౌలింగ్  చేసే   జట్లు.. బౌలర్ స్థానంలో మరో బ్యాటర్ కు ఛాన్స్ ఇస్తున్నాయి.  

కానీ ఢిల్లీ - లక్నో తో మ్యాచ్ లో   లక్నో టీమ్  అయుష్ బధోని  స్థానంలో  కృష్ణప్ప గౌతమ్ ను తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా చేస్తే ఒక జట్టులో బ్యాటింగ్ కు వచ్చేది 12 మంది అవుతారు కదా అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. 

ఈ చర్చను కాసేపు పక్కనబెడితే  అసలు.. ఇంపాక్ట్ ప్లేయర్లుగా వస్తున్న వారు (ముఖ్యంగా బౌలర్లు) ఏ మేరకు సక్సెస్ అవుతున్నారు..?  గడిచిన ఐదు మ్యాచ్ లలో   ఈ రూల్ వల్ల టీమ్ లు లాభపడ్డాయా..?  మునిగాయా..? 

ఇంపాక్ట్ ప్లేయర్‌ గా వచ్చిన బౌలర్ల ప్రదర్శన.. 

ఈ లీగ్ లో  సీఎస్కే - గుజరాత్ మ్యాచ్ లో   అంబటి రాయుడు స్థానంలో   తుషార్ దేశ్‌పాండే వచ్చాడు.  ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తొలి క్రికెటర్ అతడే.  కానీ తుషార్ వల్ల చెన్నై కంటే  గుజరాత్ ఎక్కువగా లాభపడ్డది.   తుషార్..   3.2 ఓవర్లు విసిరి 51 పరుగులు  ఇచ్చాడు.  తీసింది ఒక్క వికెట్ మాత్రమే.   పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ లో భానుక రాజపక్స స్థానంలో వచ్చిన రిషి ధావన్.. ఒక్క ఓవర్ వేసి 15 పరుగులు సమర్పించుకున్నాడు.  

శనివారం  జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా ఈ ఇంపాక్ట్  బౌలర్లు  విఫలమయ్యారు.  రాజస్తాన్ -  సన్ రైజర్స్ మ్యాచ్ లో పడిక్కల్ స్థానంలో వచ్చిన  నవ్‌దీప్ సైనీ.. 2 ఓవర్లు వేసి  ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. ముంబై - ఆర్సీబీ  మ్యాచ్ లో     ఎంఐ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో   జేసన్  బెహ్రండార్ఫ్..  3 ఓవర్లు వేసి 37 పరుగులిచ్చాడు.  

 

వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మ్యాచ్ గతిని  మార్చాలి.  మ్యాచ్ లో  సదరు ఆటగాడి ప్రభావం కచ్చితంగా ఉండాలి.  బ్యాటింగ్ కు గానీ బౌలింగ్ కు గానీ వచ్చిన ఆటగాడు.. మ్యాచ్ లో కాస్తో కూస్తో ప్రభావం చూపాలి. కానీ గడిచిన ఐదు మ్యాచ్ లలో మాత్రం  ఇంపాక్ట్ ప్లేయర్  మూలసూత్రాన్ని ఇంతవరకూ ఏ  ప్లేయర్ కూడా సక్రమంగా నిర్వర్తించలేదనే చెప్పొచ్చు.  ఈ ‘ఇంపాక్ట్’ బౌలర్లు.. మొత్తంగా  9.2 ఓవర్లలో  ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 137  పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ లలో    ప్రభావం చూపించకపోగా తమ జట్ల పరాభవాలకు కూడా కారణమవుతున్నారు. తొలి మ్యాచ్ లో చెన్నై ఓడటానికి తుషార్ చెత్త బౌలింగ్ ప్రధాన కారణం. నిన్న   ముంబై బౌలర్ జేసన్ కూడా భారీగానే పరుగులిచ్చి  జట్టు ఓటమిలో  భాగమయ్యాడు. మరీ రాబోయే మ్యాచ్ లలో అయినా  జట్లు ఈ  నిబంధనను  సక్రమంగా వాడుకుంటాయో లేదో చూడాలి. 

బ్యాటర్లు  కాస్త బెటరే.. 

బౌలర్ల పరిస్థితి  ఇలా ఉంటే   బ్యాటర్లు కూడా అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయలేదు.  తొలి మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్.. 22 పరుగులు చేశాడు. కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్  పంజాబ్ తో మ్యాచ్  లో 28 బంతుల్లో 34 రన్స్ చేశాడు.   సన్ రైజర్స్  బ్యాటర్ అబ్దుల్ సమద్ (34) కూడా   ఫర్వాలేదనిపించాడు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?