IPL 2023: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్! ధోనీ మెరుపులు... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్..

By Chinthakindhi RamuFirst Published Mar 31, 2023, 9:33 PM IST
Highlights

IPL 2023 CSK vs GT: 92 పరుగులు చేసి అవుటైన రుతురాజ్ గైక్వాడ్..  20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. 

ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లోనూ బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా రుతురాజ్ గైక్వాడ్ ఒంటరిపోరాటంతో 92 పరుగులు చేసి, చెన్నై సూపర్ కింగ్స్‌కి మంచి స్కోరు అందించగా ఆఖర్లో మెరుపులు మెరిపించిన ధోనీ, అభిమానులను అలరించాడు.. 

యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు, తొలి ఫోర్, తొలి సిక్సర్, తొలి హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  6 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన డివాన్ కాన్వేని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...

Latest Videos

మహ్మద్ షమీకి ఇది 100వ ఐపీఎల్ వికెట్ కావడం విశేషం. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో 4, 6, 4 బాది 17 పరుగులు రాబట్టిన మొయిన్ ఆలీ, ఆ తర్వాత రషీద్ ఖాన్ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకోవడంతో నాటౌట్‌గా తేలాడు. అయితే ఆ అవకాశాన్ని సరిగా వాడుకోలేకపోయాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన బెన్ స్టోక్స్, ఆ తర్వాత బంతికే సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు బెన్ స్టోక్స్. 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

అంబటి రాయుడు 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి, జోషువా లిటిల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

రవీంద్ర జడేజా 2 బంతుల్లో 1 పరుగు చేసి అల్జెరీ జోషఫ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన శివమ్ దూబే, మహ్మద్ షమీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఒకానొక దశలో 151/4 స్కోరుతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయి 163/7 స్థితికి చేరుకుంది. ఆఖరి ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాదిన ధోనీ 7 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
 

click me!