
ఐపీఎల్-16లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. మూడు రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ లో లో స్కోరింగ్ థ్రిల్లర్ లో ఐదు పరుగుల తేడాతో ఓడిన గుజరాత్.. తాజాగా రాజస్తాన్ తో జైపూర్ లో ముగిసిన పోరులో మాత్రం ఎటువంటి డ్రామాకు చోటివ్వకుండా పని పూర్తి చేసింది. రాజస్తాన్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 13.5 ఓవర్లలోనే గుజరాత్ లక్ష్యాన్ని ఈజీగా అందుకుంది.
రాజస్తాన్ బ్యాటింగ్ చేసినప్పుడు గుజరాత్ స్పిన్నర్లు రాణించిన చోట శాంసన్ స్పిన్ త్రయం అశ్విన్, జంపా, చాహల్ లు చేతులెత్తేశారు. జంపాను హార్ధిక్ పాండ్యా ఆటాడుకున్నాడు. గుజరాత్ స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ రాజస్తాన్ బౌలర్లకు మాత్రం పీడకలను మిగిల్చింది.
119 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లే తొలి వికెట్ కు 9.4 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. శుభ్‌మన్ గిల్ (35 బంతుల్లో 36, 6 ఫోర్లు) మరీ ధాటిగా ఆడకపోయినా ఫర్వాలేదనిపించాడు. వృద్ధిమాన్ సాహా.. 34 బంతులలో 5 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
గిల్ ను పదో ఓవర్లో చాహల్ ఔట్ చేశాడు. చాహల్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడబోయిన గిల్.. స్టంపౌట్ అయ్యాడు. కానీ వన్ డౌన్ లో వచ్చిన హార్ధిక్ పాండ్యా.. జంపా వేసిన 11వ ఓవర్లో దుమ్ము దులిపాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 6 తో 24 పరుగులు రాబట్టాడు. ప్రధాన స్పిన్నర్ గా ఉన్న అశ్విన్ కు శాంసన్ 12 వ ఓవర్ దాకా బంతిని ఇవ్వకపోవడం గమనార్హం. ఢిల్లీతో మ్యాచ్ లో స్లో బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కున్న హార్ధిక్ ఈ మ్యాచ్ లో మాత్రం ధాటిగా ఆడాడు. 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 39 రన్స్ చేశాడు.
అంతకుముందు రాజస్తాన్.. టాస్ గెలిచి ఫప్ట్ బ్యాటింగ్ చేసి 118 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్.. 30 పరుగులతో టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా షమీ, హార్ధిక్, జోషువా లిటిల్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. ఏడింటిలో గెలిచి 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు రాజస్తాన్ 10 మ్యాచ్ లలో ఐదు మాత్రమే నెగ్గి పది పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక నుంచి రాబోయే మ్యాచ్ లు ఆ జట్టుకు చాలా కీలకం. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆ జట్టు రాబోయే మ్యాచ్ లలో గెలిచి తీరాల్సిందే..