
ఐపీఎల్ 2022 సీజన్, ముంబై ఇండియన్స్‌కి పీడకలను మిగిల్చింది. 8 సీజన్ల గ్యాప్‌లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్, అంతకుముందు ప్లేఆఫ్స్ చేరకపోయినా ఆఖరి స్థానంలో అయితే నిలవలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్... ఆ చేదు జ్ఞాపకాలను ఇంకా మరిచిపోయినట్టు లేదు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, 10 ఓవర్లలోపే 4 కీలక వికెట్లు కోల్పోయింది. 13 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
రూ.17.5 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి రీస్ తోప్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జ్వరం నుంచి కోలుకుని నేటి మ్యాచ్‌లో ఆడుతున్న రోహిత్ శర్మ, ఇంకా పూర్తి ఆరోగ్యంతో ఆడుతున్నట్టు కనిపించలేదు. 10 బంతులు ఆడిన రోహిత్ శర్మ, ఒక్క పరుగు మాత్రమే చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్..
16 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మైకేల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో షాబజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. తొలి మ్యాచ్ ఆడుతున్న నేహాల్ వదేరా, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదాడు...
ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో కర్ణ్ శర్మ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన షాట్‌ని ఆపేందుకు డైవ్ చేసిన రీస్ తోప్లే గాయపడ్డాడు. నొప్పిని భరించలేకపోయిన తోప్లే, ఫిజియో సాయంతో పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన తిలక్ వర్మ, 16 పరుగులు రాబట్టాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోరు 78 పరుగులకి చేరుకుంది.
కర్ణ్ శర్మ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన నేహాల్ వదేరా 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కి ఈ ఇద్దరూ కలిసి జోడించిన 50 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.