మొదట దంచారు.. ఆపై కూల్చారు.. సన్ రైజర్స్‌పై రాజస్తాన్ ఘన విజయం..

Published : Apr 02, 2023, 07:26 PM IST
మొదట దంచారు.. ఆపై కూల్చారు.. సన్ రైజర్స్‌పై రాజస్తాన్  ఘన విజయం..

సారాంశం

IPL 2023: ఐపీఎల్ లో   సన్ రైజర్స్ తొలి మ్యాచ్ లో  రైజ్ అవలేదు.  తొలుత బంతితో ఆ తర్వాత బ్యాట్ తో  విఫలమై మొదటి మ్యాచ్ లోనే అట్టర్ ఫ్లాఫ్ అయింది.    

ఐపీఎల్ -16ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో మొదలుపెట్టింది.  ముందు బౌలింగ్ లో  దారుణంగా విఫలమైన  ఎస్ఆర్‌‌హెచ్.. తర్వాత భారీ లక్ష్యాన్ని చూసి  బ్యాటింగ్ లో  కూడా గజగజ వణికింది.  రాజస్తాన్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు ఏ క్రమంలోనూ  క్రీజులో నిలబడలేకపోయారు.  ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన  204 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో ఎస్ఆర్‌హెచ్..  20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులే చేయగలిగింది.  ఫలితంగా రాజస్తాన్.. 72 పరుగుల తేడాతో గెలిచింది.  

ఈ సీజన్ లో తొలి మూడు మ్యాచ్ లు ఆడిన జట్లు (గుజరాత్, లక్నో, పంజాబ్) తమ సొంత మైదానాల్లో ఆడి విజయాలు సాధిస్తే  అందుకు భిన్నంగా హైదరాబాద్.. ఉప్పల్ లో ఆడి  ఓటమిని మూటగట్టుకుంది.   

ఈ మ్యాచ్ లో  రాజస్తాన్ నిర్దేశించిన  204 పరుగుల లక్ష్య ఛేదనలో  సన్ రైజర్స్ ఓటమి తొలి ఓవర్లోనే   తేలిపోయింది.   ట్రెంట్ బౌల్ట్ వేసిన  మొదటి ఓవర్లోనే హైదరాబాద్ కు డబుల్ స్ట్రోక్ తాకింది.   బౌల్ట్.. మూడో బంతికి  అభిషేక్ శర్మ  (0) క్లీన్  బౌల్డ్ కాగా నాలుగో బంతికి  రాహుల్ త్రిపాఠి (0) జేసన్ హోల్డర్ కు క్యాచ్ ఇచ్చాడు.  

సున్నాకే రెండు..

సున్నాకే రెండు వికెట్లు పడిపోయిన  వేళ..  మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్  (23 బంతుల్లో 27, 3 ఫోర్లు)   హ్యారీ బ్రూక్  (21 బంతుల్లో   13, 1 ఫోర్) లు కాస్త అడ్డునిలిచారు.  ఈ ఇద్దరూ మూడో వికెట్ కు  34 పరుగులు  జోడించారు.  కానీ  టెస్టుల కన్నా మరీ దారుణంగా ఆడారు.   ఈ సీజన్ లో  రూ. 13.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన బ్రూక్.. 21 బంతులు ఆడి 13  పరుగులే చేయగలిగాడు. క్రీజులో పడుతూ లేస్తూ ఆడిన బ్రూక్ ను.. చహల్  వేసిన ఏడో ఓవర్లో  చివరి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఆ తర్వాతా కోలుకోలే.. 

బ్రూక్ అవుట్ అయినాక  సన్ రైజర్స్ పతనం మరీ  వేగవంతమైంది.   జేసన్ హోల్డర్ వేసిన 8వ ఓవర్లో    రెండో బంతికి వాషింగ్టన్  సుందర్  (1)  భారీ షాట్ ఆడి హెట్మెయర్ కు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ వేసిన   పదో ఓవర్లో మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్  (8)  కూడా  ఔటయ్యాడు.  కాస్తో కూస్తో ఆడిన మయాంక్ అగర్వాల్  ను  చహల్ బౌల్డ్ చేశాడు.  13 బంతుల్లో  ఓ సిక్స్, ఓ ఫోర్ తో   18 పరుగులు చేసిన  అదిల్ రషీద్.. చహల్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు.    15 ఓవర్లకు   ఎస్ఆర్‌హెచ్.. ఏడు వికెట్ల నష్టానికి  81 పరుగులు చేసింది.   

వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్న  భువనేశ్వర్  (6) ను చహల్  18వ ఓవర్లో బౌల్డ్ చేశాడు.  ఆఖర్లో ఉమ్రాన్ మాలిక్ (8 బంతుల్లో 19 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) 4, 6 కొట్టి  సన్ రైజర్స్ స్కోరును వంద పరుగులు దాటించాడు. చివరి ఓవర్ నవ్దీప్ సైనీ వేయగా.. ఆ ఓవర్లో అబ్దుల్  సమద్ (32 బంతుల్లో  32 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఉమ్రాన్  మెరుపులు మెరిపించి స్కోరు బోర్డును 130 పరుగులు దాటించారు. ఆఖరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు రావడం విశేషం  రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా  బౌల్ట్ రెండు వికెట్లు  పడగొట్టాడు.  హోల్డర్, అశ్విన్ లు తలా ఓ వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  రాజస్తాన్ రాయల్స్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది.   ఆ జట్టులో  ఫస్ట్ త్రీ బ్యాటర్స్ హాఫ్ సెంచరీలు చేశారు. జోస్ బట్లర్ (54), యశస్వి జైస్వాల్ (54) తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్  (55) లు  మెరుపులు మెరిపించారు.  

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?