IPL 2023: మరోసారి డుప్లెసిస్ - మ్యాక్స్‌వెల్ షో.. ఆఖర్లో తడబాటు.. అయినా రాజస్తాన్‌కు భారీ టార్గెట్

Published : Apr 23, 2023, 05:30 PM IST
IPL 2023:  మరోసారి డుప్లెసిస్ - మ్యాక్స్‌వెల్ షో..  ఆఖర్లో తడబాటు..  అయినా రాజస్తాన్‌కు భారీ టార్గెట్

సారాంశం

IPL 2023, RCB vs RR:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  - రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న  మ్యాచ్ లో  ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్  లు వీరబాదుడు బాదారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  - రాజస్తాన్ రాయల్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న 32 వ లీగ్ మ్యాచ్ లో  ఆర్సీబీ బ్యాటర్లు  ఫాఫ్ డుప్లెసిస్ (39 బంతులలో 62, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 77, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)  మరోసారి వీరబాదుడు బాదారు.  ఈ ఇద్దరి బాదుడు ఫలితంగా   ఆర్సీబీ..  నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ  మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడంతో  ఆ జట్టు  అనుకున్నంత టార్గెట్ ఇవ్వలేకపోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్  చేసేందుకు వచ్చిన  ఆర్సీబీకి   ఇంకా ప్రేక్షకులు సీట్లలో సరిగా కూర్చోకముందే షాక్ తాకింది.   బెంగళూరు ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్  కే  కెప్టెన్ విరాట్ కోహ్లీ  డకౌట్ అయ్యాడు.  బౌల్ట్ వేసిన  ఇన్‌స్వింగర్ తో  కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  వన్ డౌన్ లో వచ్చిన  షాబాజ్ అహ్మద్ ను కూడా బౌల్ట్ తన రెండో ఓవర్లో   ఔట్  చేశాడు.  2.1 ఓవర్లకు ఆర్సీబీ  స్కోరు  12-2. 

కే పోయినా జీఎఫ్ దంచారు.. 

ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లీ, గ్లెన్  మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ లు  ఆ జట్టుకు చాలా కీలకం. ఆర్సీబీ అభిమానులు వీరిని  కేజీఎఫ్ అని పిలుస్తారు.  అయితే ఈ మ్యాచ్ లో  కోహ్లీ విఫలమైనా   మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ మాత్రం రెచ్చిపోయారు.  తాను ఎదుర్కున్న తొలి బంతికే  బౌండరీ బాదిన   మ్యాక్సీ.. డుప్లెసిస్ తో కలిసి   మూడో వికెట్ కు   66 బంతుల్లోనే  127 పరుగులు జోడించాడు.   సందీప్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో డుప్లెసిస్ 6,6,4 బాదాడు.  మ్యాక్సీ కూడా తాను ఎదుర్కున్న ఏ బౌలర్ నూ  వదిలిపెట్టలేదు. హోల్డర్  వేసిన పదో ఓవర్లో  సిక్సర్ బాదిన మ్యాక్సీ..  27 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలోనే  ఆర్సీబీ స్కోరు 100 దాటింది. హాఫ్ సెంచరీ తర్వాత మ్యాక్స్‌వెల్ జోరు మరింత  పెంచాడు.  

బౌల్ట్ వేసిన  12వ ఓవర్లో   నాలుగో బాల్ కు ఫోర్ కొట్టిన  డుప్లెసిస్ కూడా  31 బంతుల్లో  అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్  లో అతడికి  ఇది ఏడు మ్యాచ్ లలోనే 5వ హాఫ్ సెంచరీ.  13 ఓవర్లు ముగిసేటప్పటికీ   ఆర్సీబీ  135 -2 గానే ఉంది.  11 ఓవర్లలో  12-2 నుంచి 135-2  కు చేరిన ఆర్సీబీ  ఇక ఈ మ్యాచ్ లో  230  కొట్టడం ఖాయమే అనుకున్నారంతా. కానీ అప్పుడే వింటేజ్ ఆర్సీబీ మళ్లీ బయటకు వచ్చింది.  

బ్రేక్ ఇచ్చిన సందీప్ శర్మ-జైస్వాల్.. 

ధాటిగా ఆడుతున్న   ఆర్సీబీ జోరుకు సందీప్ శర్మ  బ్రేక్ వేశాడు. అతడు వేసిన   14వ ఓవర్లో  రెండో బంతికి డుప్లెసిస్   ఎక్స్ ట్రా కవర్ దిశగా ఆడాడు.  అక్కడే ఉన్న  యశస్వి జైస్వాల్  నేరుగా  నాన్ స్ట్రైకర్ ఎండ్ లో త్రో విసిరాడు. బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో డుప్లెసిస్ రనౌట్ అయ్యాడు.  మరుసటి ఓవర్లోనే  అశ్విన్.. మ్యాక్స్‌వెల్ ను క్యారమ్ బాల్ తో   ఔట్ చేశాడు. రివర్స్ హిట్ చేయబోయిన మ్యాక్సీ.. బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద ఉన్న హోల్డర్ కు చిక్కాడు. చాహల్ వేసిన 17వ ఓవర్లో లోమ్రర్ (8) పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చాడు. ప్రభుదేశాయ్ (0) దినేశ్ కార్తీక్ తో సమన్వయ లోపం కారణంగా  రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్లో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?