
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..
ఇరు జట్ల మధ్య ఐపీఎల్ 2023 సీజన్‌లో బెంగళూరులో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ అందుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ టీమ్ 171 పరుగులు చేసింది...
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి తొలి వికెట్‌కి 148 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించడంతో ఆర్‌సీబీ ఈ లక్ష్యాన్ని 3.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించేసింది. అయితే సెకండాఫ్‌లో వరుస రివెంజ్ డ్రామాలు నడుస్తున్నాయి..
ఫస్టాఫ్‌లో తమపై గెలిచిన జట్లను, సెకండాఫ్‌లో ఓడించి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి టీమ్స్. ఫస్టాఫ్‌లో కేకేఆర్‌ని ఓడించిన పంజాబ్ కింగ్స్‌ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది కోల్‌కత్తా. హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌ది ఇదే కథ...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత నాలుగు మ్యాచుల్లో ఆర్‌సీబీ విజయాలు అందుకుంది. అయితే వాంఖడే స్టేడియంలో జరిగిన గత ఆరు మ్యాచుల్లో ఐదు సార్లు ముంబై ఇండియన్స్ గెలిచింది. చివరిగా 2015లో ముంబైని వాంఖడే స్టేడియంలో ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
తొలి 10 మ్యాచుల్లో చెరో ఐదేసి విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచుల్లో కనీసం 3 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.
పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ, 8వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్‌లో ఓడిపోతే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో పడిపోతాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఏకంగా టాప్ 3 ప్లేస్‌కి ఎగబాకుతుంది..
గత రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ డకౌట్ కావడం, జోఫ్రా ఆర్చర్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరం కావడం.. ముంబై ఇండియన్స్‌ని వెంటాడుతున్న కష్టాలు. గత మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడింది ముంబై. మరోవైపు ఆర్‌సీబీ కూడా గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైశాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హజల్‌వుడ్
ముంబై ఇండియన్స్ జట్టు ఇది: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్