
అదే ఉత్కంఠ. అదే జోష్. టీమ్ లు మారాయంతే. కోల్‌కతా నైట్ రైడర్స్.. పంజాబ్ కింగ్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ కూడా ఐపీఎల్-16లో చాలా పోటీల మాదిరిగానే ఉత్కంఠగా ముగిసింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ థ్రిల్లర్ కు ఉన్న గిరాకీ రీత్యా ఈ మ్యాచ్ కూడా అదే దోవలో పయనించింది. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్ లో కేకేఆర్.. పంజాబ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. పంజాబ్ బ్యాటర్ల వైఫల్యానికి తోడు బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే బౌలింగ్ చేసి ఆ జట్టు ఓటమిలో పాలుపంచుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కేకేఆర్ ఆ రేసులో పోటీ పడేందుకు సిద్ధమైంది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి దూసుకెళ్లడం గమనార్హం.
180 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగానే ఆరంభమైంది. ఫస్ట్ రెండు ఓవర్లలో పది పరుగులే వచ్చాయి. కానీ రిషి ధావన్ వేసిన మూడో ఓవర్లో జేసన్ రాయ్ రెండు బౌండరీలు కొట్టగా అర్ష్‌దీప్ వేసిన నాలుగో ఓవర్లో గుర్బాజ్ ఓ సిక్స్, ఫోర్ కొట్టి జోరుమీదే కనిపించాడు.
ఆదుకున్న రాణా..
నాథన్ ఎల్లీస్ ఐదో ఓవర్లో నాలుగో బాల్ కు గుర్బాజ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా 38 పరుగుల వద్ద పంజాబ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రాయ్.. సామ్ కరన్, లివింగ్‌స్టోన్ లు వేసిన 6,7 ఓవర్లలో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదినా హర్‌ప్రీత్ బ్రర్ వేసిన 8వ ఓవర్లో రెండో బాల్ కు అతడు భారీ షాట్ ఆడగా మిడ్ వికెట్ వద్ద షారుఖ్ ఖాన్ క్యాచ్ అందుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ (11) కూడా ఆకట్టుకోలేదు.
వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా.. లివింగ్‌స్టోన్ వేసిన 11వ ఓవర్లో 4,4,6 బాదాడు. రాహుల్ చాహర్ వేసిన 16వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాణా.. తర్వాత బంతికే లివింగ్‌స్టోన్ కు క్యాచ్ ఇచ్చాడు. 16 ఓవర్లు ముగిసేటప్పటికీ కేకేఆర్ స్కోరు 129-4గా ఉంది.
అదే డ్రామా..
చివరి నాలుగు ఓవర్లలో కేకేఆర్ విజయానికి 51 పరుగులు అవసరమవగా నాథన్ ఎల్లీస్ వేసిన 17వ ఓవర్లో 15 పరుగులొచ్చాయి. అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్లో 10 పరుగులొచ్చాయి. దీంతో విజయ సమీకరణం 2 ఓవర్లలో 26 పరుగులకు మారింది. కానీ సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో రసెల్ (23 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. ఈ ఓవర్లో రసెల్ 6, 6, 6 బాదడంతో 20 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా అర్ష్‌దీప్ వేసిన ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ పరుగులేమీ రాలేదు. ఆ తర్వాత రసెల్, రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నా కూడా 1, 1, 2 పరుగులే ఇచ్చాడు. ఐదో బంతికి రసెల్ రనౌట్ అయ్యాడు. ఇక్కడ మళ్లీ డ్రామా. లాస్ట్ బాల్ ఒక్క రన్ తీస్తే డ్రా.. రెండు తీస్తే విజయం. ఈ క్రమంలో అర్ష్‌దీప్ వేసిన ఫుల్ టాస్ ను రింకూ బౌండరీకి తరలించి కేకేఆర్ కు మరోసారి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున సారథి శిఖర్ ధావన్ (57) తో పాటు ఆఖర్లో షారుక్ ఖాన్ (21 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు.