దూబే దుమారం.. కసిమీద కొట్టిన కాన్వే.. ఆర్సీబీ ముందు కొండంత లక్ష్యం

Published : Apr 17, 2023, 09:20 PM IST
దూబే దుమారం.. కసిమీద కొట్టిన కాన్వే.. ఆర్సీబీ ముందు కొండంత లక్ష్యం

సారాంశం

IPL 2023, RCB vs CSK: ఐపీఎల్ -2023 ఎడిషన్ లో  మరో  హైస్కోరింగ్  గేమ్.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా   ఆర్సీబీ - సీఎస్కే మధ్య  జరుగుతున్న  మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై  భారీ స్కోరు చేసింది. 

ఐపీఎల్ - 16లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సంచలన బ్యాటింగ్ తో  అదరగొట్టింది.  బెంగళూరులోని చిన్నస్వామి  స్టేడియం వేదికలో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల వరద పారించారు.  ఓపెనర్ డెవాన్ కాన్వే (45 బంతుల్లో  83, 6 ఫోర్లు, 6 సిక్సర్లు)  కసిగా బాదగా..  మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే  (27 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దుమ్ము దుమారం  రేపాడు. ఈ ఇద్దరూ ఆర్సీబీ  బౌలర్లపై ఇసుక  తుఫాను కమ్మేసినట్టు పోటెత్తడంతో నిర్ణీత 20 ఓవర్లలో  చెన్నై.. 6 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసింది. మరి  చిన్నస్వామి  స్టేడియంలో పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న   ఆర్సీబీని  సీఎస్కే బౌలర్లు నిలువరించగలరా..?  

టాస్ ఓడి  ఫప్ట్ బ్యాటింగ్ చేసిన  చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (3) వికెట్ ను త్వరగానే కోల్పోయింది.   సిరాజ్ వేసిన  మూడో ఓవర్లో రుతురాజ్.. పార్నెల్ కు క్యాచ్ ఇచ్చాడు.  వన్ డౌన్ లో వచ్చిన  అజింక్యా రహానే (20 బంతుల్లో   37,  3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు   రెండో వికెట్ కు  74 పరుగులు జోడించారు.  

పార్నెల్ వేసిన రెండో ఓవర్లోనే  4, 6 బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేసిన కాన్వే అదే జోరు కొనసాగించాడు. ఈ ఇద్దరూ పవర్ ప్లే లో  పార్నెల్, విజయ్ కుమార్ వైశాఖ్ ను లక్ష్యంగా చేసుకుని  స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. పార్నెల్  వేసిన  ఆరో ఓవర్లో  4, 6, 4తో 15 పరుగులు రాబట్టిన రహానే.. హసరంగ వేసిన పదో ఓవర్లో  బౌల్డ్ అయ్యాడు. 

దూబే  తుఫాను.. 

రహానే నిష్క్రమించడానికి ముందే  ధాటిగా ఆడిన   కాన్వే..  హసరంగ వేసిన  పదో ఓవర్లో ఐదో బంతికి డబుల్ తీసి  32 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. ఇక అతడికి శివమ్ దూబే  కూడా తోడవడంతో  అగ్నికి ఆయువు తోడైనట్టైంది. వైశాఖ్ వేసిన  12వ ఓవర్లో కాన్వే  4, 4, 6  బాదాడు.    మ్యాక్స్‌వెల్ వేసిన 11వ ఓవర్లో  నాలుగో బాల్ ను భారీ సిక్సర్  కొట్టిన దూబే.. సిరాజ్ వేసిన  14వ ఓవర్లో  4, 6 కొట్టాడు. ఇక వైశాఖ్ వేసిన  15వ ఓవర్లో  కాన్వే  రెండు  సిక్సర్లు , ఓ ఫోర్ తో చెలరేగాడు. ఈ క్రమంలో 80లలోకి చేరుకున్న అతడు సెంచరీ చేస్తాడని భావించినా   హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు.  దీంతో  37 బంతుల్లోనే  80 పరుగులు చేసిన ఈ భాగస్వామ్యానికి తెరపడింది. 

 

200 దాటించారు..

దూబే - కాన్వేలు నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన  అంబటి రాయుడు (14)  విఫలమైనా మోయిన్ అలీ  (19 నాటౌట్) దూకుడుగా ఆడి  చెన్నై స్కోరును  200 దాటించాడు. ధోని (1 నాటౌట్) ఒకటే బంతి ఆడాడు. కాన్వే, రహానే, దూబేల ధాటికి  వైశాఖ్.. 4 ఓవర్లలో  62 పరుగులు సమర్పించుకున్నాడు.    పార్నెల్ కూడా 4 ఓవర్లలో  48 పరుగులిచ్చాడు.  సిరాజ్, హర్షల్ కూడా భారీగా పరుగులిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !