
ఐపీఎల్-2023లో కొద్దిరోజుల క్రితం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యచ్ లో చివరి ఓవర్లో 29 పరుగులు అవసరముండగా ఐదు భారీ సిక్సర్లతో సంచలనం సృష్టించిన రింకూ సింగ్.. తర్వాత తాను ఆడిన మ్యాచ్ లలో కూడా నిలకడగా రాణిస్తూ ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతున్నాడు. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రింకూ.. ఈస్థాయికి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. రింకూ తండ్రి, అన్నలు ఎల్పీజీ సిలండర్లు ఇంటింటికీ తిరిగి సప్లై చేసేవారన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అదే రింకూ.. తాను సంపాదిస్తున్నదాంట్లోంచి కొంత భాగాన్ని పేద పిల్లల కలలను నెరవేర్చేందుకు సాయపడుతున్నాడు. ఆ ఆసక్తికర విషయాలివిగో..
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు.. అలీగఢ్ (ఉత్తరప్రదేశ్)కు చెందిన రింకూ, అక్కడ పేద క్రికెటర్లు నివాసం ఉండేందుకు గాను రూ. 50 లక్షలు ఖర్చు చేసి ఓ హాస్టల్ నిర్మిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పనులు కూడా 90 శాతం పూర్తి కావొచ్చాయి.
ఈ విషయాన్ని స్వయంగా రింకూ చిన్ననాటి కోచ్ మసూద్ జఫర్ అమిని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో వెల్లడించాడు. మసూద్ మాట్లాడుతూ.. ‘రింకూ ఇక్కడ క్రికెట్ నేర్చుకునే పేద పిల్లలకు హాస్టల్ నిర్మించాలని చాలాకాలంగా అనుకుంటున్నాడు. కానీ రింకూ కుటుంబ పరిస్థితి కూడా కొన్నాళ్ల క్రితం అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రింకూ తనకు ఐపీఎల్ ద్వారా వచ్చిన సంపాదన ఉండటంతో తన కలను నిజం చేస్తున్నాడు. ఈ భవనానికి సంబంధించిన 90 శాతం పనులు పూర్తయ్యాయి. దాదాపు వచ్చే నెల నాటికి ఇది పూర్తి కావొచ్చు. ఈ బిల్డింగ్ ను రింకూ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. ఇక్కడ సుమారు 50 మందికి సరిపడా సదుపాయాలున్నాయి. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుందామనుకుని సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడే పేద పిల్లలకు ఇది ఆసరాగా ఉంటుంది..’ అని తెలిపాడు.
చిన్ననాటి నుంచి రెండు ఇరుకు గదుల్లో నివాసముండి.. ఆకలి, కష్టం విలువ తెలిసినవాడు కాబట్టే తనలా ఎవరూ బాధలు పడొద్దని ఐపీఎల్ ద్వారా సంపాదించినదాంట్లోంచి కొంత మొత్తాన్ని పేద క్రికెటర్ల ఉన్నతి కోసం ఖర్చుపెడుతుండటం అభినందించదగ్గదే. రింకూ మాదిరిగానే మిగతా క్రికెటర్లు కూడా ఆలోచిస్తే దేశంలో చాలామంది చిన్నారుల కలలు నిజం చేసినట్టే. అయితే అది క్రికెట్ లోనే కాదు. ఏ క్రీడలో అయినా చిన్నారులను బాల్య దశ నుంచే ప్రోత్సహిస్తూ వారికి మద్దతు అందిస్తే ఫలితాలు మరో విధంగా ఉండటం ఖాయం. మరి ఐపీఎల్ లో కోటానుకోట్లు సంపాదిస్తున్న క్రికెటర్లు కూడా రింకూ మాదిరిగా ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు.