
ఐపీఎల్ 2023 సీజన్, మిగిలిన సీజన్లకు భిన్నంగా సాగుతోంది. ఏ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో అస్సలు ఊహించని విధంగా మ్యాచులు జరుగుతున్నాయి. కేకేఆర్‌పై 150 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలో ఊదేసిన రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 59 పరుగులకు ఆలౌట్ అయ్యి 112 పరుగుల తేడాతో ఘోర ఓటమి మూటకట్టుకుంది...
బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ని సిరాజ్ డకౌట్ చేయడంతో మొదలైన రాజస్థాన్ రాయల్స్ వికెట్ల పతనం ఏ దశలోనూ ఆడలేదు. జోస్ బట్లర్, పార్నెల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.
కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఫోర్ బాది, పార్నెల్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా దేవ్‌దత్ పడిక్కల్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సీజన్‌లో తొలి సారి బ్యాటింగ్‌కి వచ్చిన జో రూట్ 10 పరుగులు చేయగా ధ్రువ్ జురెల్ 1 పరుగుకి అవుట్ అయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ కాగా సిమ్రాన్ హెట్మయర్ 19 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఆడమ్ జంపా 2, అసిఫ్ డకౌట్ అయ్యారు. 10.3 ఓవర్లలోనే రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగలిగింది..
19 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్‌తో కలిసి తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్న కోహ్లీ, కెఎం అసిఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ. ఈ దశలో ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించారు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏడో హాఫ్ సెంచరీ బాదాడు..
అంతేకాకుండా 2023 సీజన్‌లో 600 పరుగులు అందుకున్న మొదటి ప్లేయర్‌గానూ నిలిచాడు. ప్రమాదకరంగా మారుతున్న డుప్లిసిస్ కూడా అసిఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మహిపాల్ లోమ్రార్ 2 బంతుల్లో 1 పరుగు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ కాగా దినేశ్ కార్తీక్ 2 బంతులాడి డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో కార్తీక్‌కి ఇది 16వ డకౌట్. రోహిత్ శర్మతో కలిసి అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా తన రికార్డును మళ్లీ సమం చేసుకున్నాడు దినేశ్ కార్తీక్..
33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 119/1 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 2.4 ఓవర్లు 16 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి 137/5 స్థితికి చేరుకుంది..
ఆఖర్లో మెరుపులు మెరిపించిన అనుజ్ రావత్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.