ఏం కొట్టావ్ ప్రభో..! గువహతిలో గబ్బర్ గర్జన.. రాజస్తాన్ ఎదుట భారీ లక్ష్యం..

Published : Apr 05, 2023, 09:31 PM ISTUpdated : Apr 05, 2023, 09:32 PM IST
ఏం కొట్టావ్ ప్రభో..! గువహతిలో గబ్బర్ గర్జన.. రాజస్తాన్ ఎదుట భారీ లక్ష్యం..

సారాంశం

IPL 2023: ఐపీఎల్‌లో   గువహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో  జరుగుతున్న మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్  భారీ స్కోరు చేసింది.  రాజస్తాన్ బౌలర్లను  ఉతికారేసింది.  కొత్త కుర్రాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్   రాజస్థాన్ ను రఫ్ఫాడించాడు.

ఐపీఎల్ లో  ఇప్పటివరకు  ఉన్న పది జట్లలో అత్యంత  స్ట్రాంగ్ గా  ఉన్న టీమ్ లలో ఒకటైన రాజస్తాన్ రాయల్స్‌ను పంజాబ్ కింగ్స్  బ్యాటర్లు ఆటాడుకున్నారు.   ఒకరిని మించి మరొకరు దొరికిన బంతిని దొరికినట్టుగా  బాదారు. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, చహల్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను  క్లబ్ స్థాయి బౌలర్లుగా మారుస్తూ  వీరబాదుడు బాదారు.  పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్  (34 బంతుల్లో 60, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ శిఖర్ ధావన్  (56 బంతుల్లో 86 నాటౌట్, 9 ఫోర్లు,3  సిక్సర్లు), నాలుగో స్థానంలో వచ్చిన జితేశ్ శర్మ (16 బంతుల్లో 27, 2 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడటంతో  నిర్ణీత  20 ఓవర్లలో పంజాబ్.. 4 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది.   ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్  తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. 

ఐపీఎల్‌లో 8 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్న  కుర్రాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్. 22 ఏండ్ల  ఈ  పాటియాలా కుర్రాడి ఆట చూస్తే మాత్రం  ఎంతో అనుభవమున్న ఆటగాడిలా  ఆడాడు. బౌల్ట్ వేసిన  తొలి ఓవర్లో మూడో బంతినే బౌండరీగా మలిచిన ప్రభ్‌సిమ్రన్.. అసిఫ్ వేసిన రెండో ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు.   

ప్రభ్ పరాక్రమం.. 

కొత్త కుర్రాడు బాదుతుంటే తానేమైనా తక్కువ  తిన్నానా అన్నట్టుగా ధావన్ కూడా బౌల్డ్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు సాధించాడు. అసిఫ్ వేసిన నాలుగో ఓవర్లో ప్రభ్..  అతడికి చుక్కలు చూపించాడు.  ఆ ఓవర్లో  4, 4, 6, 4 సాయంతో మొత్తంగా 19 పరుగులు రాబట్టాడు. అశ్విన్ వేసిన ఐదో ఓవర్లో కూడా రెండు  బౌండరీలు కొట్టాడు. చహల్ వేసిన  8వ ఓవర్లో   రెండో బంతికి డబుల్ తీయడం ద్వారా ఐపీఎల్ లో అతడు   తొలి హాఫ్  సెంచరీ పూర్తి చేశాడు.  అదే ఊపులో బౌల్ట్ వేసిన మరుసటి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన ఈ కుర్రాడు..  జేసన్ హోల్డర్ వేసిన  నాలుగో బంతికి భారీ షాట్ ఆడి జోస్ బట్లర్ పట్టిన సూపర్ క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తొలి వికెట్ కు ధావన్ తో కలిసి ప్రభ్.. 90 పరుగులు జోడించాడు. 

 

ధావన్ - జితేశ్‌ల జోరు.. 

ప్రభ్‌సిమ్రన్ నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన  భానుక రాజపక్స (1 రిటైర్డ్ హర్ట్).. అశ్విన్ వేసిన 11వ ఓవర్లో  ధావన్ భారీ షాట్ ఆడటంతో  బంతి వచ్చి నేరుగా  రాజపక్స చేతికి తాకింది. దీంతో అతడు గ్రౌండ్ ను వీడాడు. అతడి స్థానంలో  వచ్చిన జితేశ్ శర్మ  కూడా రెచ్చిపోయి ఆడాడు.  చహల్ వేసిన  12వ ఓవర్లో  రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో ధావన్ మరో సిక్సర్ బాదాడు. అతడే వేసిన 14వ ఓవర్లో  ధావన్ మూడు, నాలుగో బంతిని బౌండరీకి తరలించి ఐపీఎల్ లో 50వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.  బౌల్ట్ వేసిన  15వ ఓవర్లో   భారీ సిక్సర్ కొట్టిన జితేశ్..  చహల్ వేసిన   16వ ఓవర్లో నాలుగో బంతికి   రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చాడు.  ఆ తర్వాతి ఓవర్లోనే అశ్విన్..  సికిందర్ రజ (1) ను బౌల్డ్ చేశాడు. 

ఆఖర్లో.. 

15 ఓవర్ల తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో  పంజాబ్ స్కోరువేగం కాస్త తగ్గింది.   16వ ఓవర్లో 7, 17వ ఓవర్లో 6, 18వ ఓవర్లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి.  కానీ   19వ ఓవర్లో  16 పరుగులొచ్చాయి.  జేసన్ హోల్డర్ వేసిన  ఆఖరి ఓవర్లో.. 7 పరుగులే వచ్చాయి. పంజాబ్ బౌలర్లలో  హోల్డర్ కు రెండు వికెట్లు దక్కగా   అశ్విన్, చహల్ లు తలా ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?