ప్లీజ్ ధోని.. ఇప్పుడే రిటైర్ కావొద్దు.. మరికొన్నాళ్లు నడిపించండి : మహేంద్రుడిని వేడుకున్న పైలట్

By Srinivas MFirst Published Apr 7, 2023, 3:29 PM IST
Highlights

IPL 2023:   చెన్నై సూపర్ కింగ్స్  టీమ్ అభిమానులకు ధోని ఒక ఆరాధ్య దైవం.  తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ధోనికీ ఉంది.  తాజాగా  ఓ పైలట్ కూడా ధోనిని  రిటైర్ కావొద్దంటూ.. 

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి   మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  ఇక ఐపీఎల్ లో అయితే అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్  టీమ్ అభిమానులకు ధోని ఒక ఆరాధ్య దైవం.  తమిళనాడులో  సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ధోనికీ ఉంది.   కాగా  2008 నుంచి  ఐపీఎల్ లో సీఎస్కేను నడిపిస్తనున్న ‘తాలా’  2023 సీజన్ ముగిసిన తర్వాత రిటైర్ అవుతాడని, ఇదే అతడి చివరి సీజన్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  

అయితే ఓ అభిమాని మాత్రం ధోని ఇప్పుడే దిగిపోవద్దని.. అతడు మరికొన్నాళ్లు కొనసాగాలని  వేడుకుంటున్నాడు.  ఆ అభిమాని మరెవరో కాదు.  చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఇటీవలే ముంబైకి తీసుకెళ్లిన విమానం పైలట్.    ఏప్రిల్ 8న ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆడేందుకు సీఎస్కే..  చెన్నై ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేముందు  పైలట్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

విమానం టేకాఫ్ అయ్యేముందు అనౌన్స్‌మెంట్ ఇస్తూ సదరు పైలట్ మాట్లాడాడు.  ‘ఎంఎస్ ధోని.. నేను మీకు  చాలా పెద్ద అభిమానిని. దయచేసి సీఎస్కేకు  కెప్టెన్ గా కొనసాగండి.  ఈసారికి మాత్రం మీరు  రిటైర్మెంట్ ప్రకటించొద్దు..’అని   చెప్పాడు. పైలట్ చెబుతున్నప్పుడు ప్లైట్ లో ఉన్నవాళ్లందరూ అతడిని వీడియో తీసుకుంటున్న దృశ్యాలు  నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.   

 

Pilot : "Please continue to be a captain of CSK. I'm a huge fan of you sir." ❤️ pic.twitter.com/fXiNwuNgI0

— DHONI Era™ 🤩 (@TheDhoniEra)

కాగా.. ధోనికి ఇది చివరి సీజన్ అని  వార్తలు వినిపిస్తున్నా దానిపై అతడు ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు.  సీఎస్కే ఆటగాళ్లు కూడా దీనిపై మాట్లాడుతూ.. ‘అలాంటిదేమీ లేదు.. ధోని ఫిట్ గా ఉన్నాడు. మరో రెండుమూడేండ్లు ఆడతాడు’అని  చెబుతుండటం గమనార్హం. మరి  తన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచే ధోని.. తన రిటైర్మెంట్ గురించి  ఏం చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

అందరి దృష్టి ‘ఎల్ క్లాసికో’పైనే.. 

ఐపీఎల్  లో ముంబై - చెన్నై  మ్యాచ్ ను  అభిమానులు  ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ రెండు జట్ల మధ్య  మ్యాచ్ అంటేనే హోరాహోరిగా ఉంటుంది.  ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న  ఈ రెండు టీమ్ లు   శనివారం  వాంఖెడే వేదికగా తలపడబోతున్నాయి. ఈ  లీగ్ లో  ఇప్పటివరకూ  ముంబై - చెన్నైలు  34 మ్యాచ్ లలో తలపడగా  ముంబై 20 మ్యాచ్ లు గెలవగా సీఎస్కే 14 మ్యాచ్ లను  నెగ్గింది.  గత సీజన్ లో రెండు జట్లూ  రెండు సార్లు తలపడగా చెరో మ్యాచ్ నెగ్గాయి.  ఇప్పటికే వాంఖడేలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఇరు జట్లూ ఈ  క్లాసిక్ పోరుపై   దృష్టిసారించాయి. మరి  రేపటి మ్యాచ్  లో ఎవరిది పైచేయి కానుందో..!

click me!