IPL 2023: సఫారీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ లో అతడి మెరుపులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ తాజాగా అతడి భార్య.. మిస్టర్ 360కి షాకిచ్చింది.
ఐపీఎల్ లో సుదీర్ఘకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సఫారీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ తర్వాత ఆ జట్టు అభిమానులు ఎక్కువగా అభిమానించేది మిస్టర్ 360నే అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. బెంగళూరును తన సెకండ్ హోమ్ గా ప్రకటించిన డివిలియర్స్ కు ఆర్సీబీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే తన సతీమణి, డివిలియర్స్ భార్య డేనియల్ డివిలియర్స్ కు మాత్రం ఆర్సీబీ అంటే ఇష్టం లేదట..!
ప్రస్తుతం ఐపీఎల్ -16 లో భాగంగా జియో సినిమాకు కామెంట్రీ విధులు నిర్వర్తిస్తున్న ఏబీడి.. తన భార్యతో కలిసి ఓ ఫన్ చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా డేనియల్ ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు ఆర్సీబీ కంటే కేకేఆర్ అంటే ఇష్టమని చెప్పిన డేనియల్.. ఎందుకని కారణం అడగ్గా ఆ టీమ్ షారుఖ్ ఖాన్ ది కదా అని తెలిపింది.
హ్యాంగ్అవుట్‌విత్ అస్ అనే షోలో భాగంగా ఏబీడి.. తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ‘మీ ఫేవరేట్ ఫుడ్..?’అని అడగ్గా ఇద్దరూ సూషి (పచ్చి కూరగాయలతో తయారుచేసే జపనీస్ వంటకం) అని చెప్పారు. ఫేవరేట్ ఆర్టిస్ట్ కోల్డ్ ప్లే (ఇదొక బ్రిటీష్ రాక్ బ్యాండ్) అని తెలిపారు. ఆ తర్వాత ‘ఈ ఐపీఎల్ లో మీరు ఏ టీమ్ కు సపోర్ట్ చేయబోతున్నారు..?’ అన్న ప్రశ్న ఎదురైంది. అప్పుడు డివిలియర్స్ ఏమాత్రం తడుముకోకుండా ‘ఆర్సీబీ’అని చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పబోయాడు. అదే సమయంలో డేనియల్.. ‘కేకేఆర్’అని చెప్పడంతో డివిలియర్స్ ముఖం తెల్లబోయింది.
Danielle De Villiers supporting KKR due to Shahrukh Khan.
A cute video! pic.twitter.com/B8fSvohPGf
డేనియల్ కేకేఆర్ అని చెప్పగానే ఏబీడి ఆమె వైపు ‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు..?’ అన్నట్టుగా చూశాడు. అప్పుడు ఆమె.. ‘ఏంటి..? అది షారుక్ ఖాన్ టీమ్. అతడు స్వచ్ఛమైన ప్రేమికుడు..’ అని చెప్పి అక్కన్నుంచి వెళ్లిపోయింది. ఇకపై ఏం చెప్పాలో అర్థం కాక ఏబీడి నిశ్చేష్టుడైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
డివిలియర్స్ ఐపీఎల్ లో ఆర్సీబీకి 2011వ సీజన్ నుంచి ఆడాడు. 2021 వరకూ ఐపీఎల్ లో ఆర్సీబీతో ఆడిన ఏబీడి.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతడు ఆర్సీబీతో లేకున్నా.. ఇటీవలే ఆ జట్టు బెంగళూరులో నిర్వహించిన ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ కార్యక్రమంలో డివిలియర్స్, గేల్ లను ఘనంగా సత్కరించింది. ఈ ఇద్దరికీ ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించింది. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ తర్వాత డివిలియర్స్.. ఆర్సీబీ అభిమానులకు భావోద్వేగపూరితమైన కృతజ్ఞతలు తెలిపాడు. ఇదే కార్యక్రమంలో ఏబీడి.. ‘ఈసాలా కప్ నమ్దే’ అన్న డైలాగ్ తో అభిమానుల్లో జోష్ నింపాడు.