IPL 2023, PBKS vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 258 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్.. 201కే పరిమితమైంది. తద్వారా లక్నో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
గత రెండు మ్యాచ్ లలో లో స్కోరింగ్ గేమ్స్ తో విసుగెత్తించిన లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ తో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో మాత్రం దానిని బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోరు చేసింది. 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్.. 201 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. పంజాబ్ తరఫున అథర్వ తైడే (36 బంతులలో 66, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. పరుగుల వరద పారిన మొహాలీలో ఇరు జట్లూ కలిపి ఏకంగా 458 రన్స్ చేశాయి. ఈ సీజన్ లో లక్నోకు 8 మ్యాచ్ లలో ఇది ఐదో విజయం. పంజాబ్‌కు నాలుగో పరాజయం.
కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాకులు తాకాయి. స్టోయినిస్ వేసిన తొలి ఓవర్లోనే పంజాబ్ సారథి శిఖర్ ధావన్ (1) డీప్ పాయింట్ వద్ద ఉన్న కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు. వన్ డౌన్ లో వచ్చిన అథర్వతో కలిసి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (9) 17 బంతుల్లో 28 పరుగులు జోడించి నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో ఓవర్లో ఔటయ్యాడు.
ఆదుకున్న అథర్వ - రజా
31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ ను అథర్వతో కలిస సికందర్ రజా ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 47 బంతుల్లో 78 పరుగులు జోడించారు. స్టోయినిస్ వేసిన 3 వ ఓవర్లో అథర్వవ 6, 4, 4 బాదాడు. అవేశ్ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో కూడా మూడు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. పవర్ ప్లే ముగిసేటప్పటికీ పంజాబ్ స్కోరు 55-2గా ఉంది. అడపాదడపా బౌండరీలు బాదుతూ వికెట్ల మధ్య సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఈ ఇద్దరూ పంజాబ్ ఇన్నింగ్స్ ను నిర్మించే యత్నం చేశారు. యశ్ ఠాకూర్ వేసిన పదో ఓవర్లో ఫసట్ బాల్ కు సింగిల్ తీసిన అథర్వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 93 పరుగులు మాత్రమే చేయగలిగింది.
A well made FIFTY by Atharva Taide off 26 deliveries.
Live - https://t.co/6If1I4omN0 pic.twitter.com/P3iMu1KQu6
పతనం..
సాఫీ గా సాగుతున్న ఈ జోడీని యశ్ ఠాకూర్ విడదీశాడు. అతడు వేసిన 12వ ఓవర్లో రజ భారీ షాట్ ఆడబోయి కృనాల్ చేతికి చిక్కాడు. అథర్వను బిష్ణోయ్ ఔట్ చేశాడు. అథర్వ నిష్క్రమించిన తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్ (13 బంతుల్లో 23, 2 ఫోర్లు, 1సిక్సర్) తో కలిసి సామ్ కరన్ (11 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్సర్) లు 14 బంతుల్లో 25 పరుగులు జోడించారు. 15 ఓవర్లకు పంజాబ్.. 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కానీ లివింగ్‌స్టోన్ ను రవి బిష్ణోయ్ 16వ ఓవర్లో రెండో బాల్ కు ఎల్బీడబ్ల్యూ ద్వారా ఔట్ చేశాడు. ఆ తర్వాత కరన్.. ఆరో వికెట్ కు జితేశ్ శర్మతో కలిసి 12 బంతుల్లోనే 26 రన్స్ జోడించాడు. అయితే నవీన్ ఉల్ హక్ వేసిన 17వ ఓవర్లో ఆరో బంతిని అతడు భారీ షాట్ ఆడబోయి బదోనికి క్యాచ్ ఇచ్చాడు. లక్ష్యం సాధించడం కష్టమే అని తెలిసినా జితేశ్ శర్మ (10 బంతుల్లో 24, 3 సిక్సర్లు) పోరాడాడు. ఠాకూర్ వేసిన 18వ ఓవర్లో రెండు భారీ సిక్సరలు బాదిన అతడు.. అదే ఓవర్లో ఐదో బంతికి రాహుల్ చేతికి చిక్కాడు. ఇదే ఓవర్లో చివరి బాల్ కు రాహుల్ చాహర్ (0) కూడా ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో షారుక్ ఖాన్ కూడా ఔటవడంతో పంజాబ్ కథ ముగిసింది. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో.. 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో కైల్ మేయర్స్ (24 బంతుల్లో 54, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 72, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అయుష్ బదోని (24 బంతుల్లో 43, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45, 7 ఫోర్లు, 1 సిక్స్) లు వీరబాదుడు బాదారు.