
ఐపీఎల్ - 16 లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో పోటీ పడనుంది. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ రెండు జట్లూ తాము ఆడిన గత మ్యాచ్ లలో ఓటమి పాలైనవే. పంజాబ్ కు సన్ రైజర్స్ షాకివ్వగా.. గుజరాత్ కు కోల్కతా ఊహించని దెబ్బ కొట్టింది. నేటి మ్యాచ్ తో తిరిగి గాడిన పడాలని ఇరు జట్లూ కోరుకుంటున్నాయి.
కాగా కోల్కతా తో మ్యాచ్ కు అందుబాటులో లేని గుజరాత్ సారథి హార్థిక్ పాండ్యా.. ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. అది గుజరాత్ కు కలిసొచ్చేదే. అతడి రాకతో జట్టులో మళ్లీ జోష్ కనిపించడం ఖాయం.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ నేటి మ్యాచ్ లో తిరిగి విజయబాట పట్టాలని భావిస్తున్నది. కోల్కతా తో మ్యాచ్ లో గెలవాల్సి ఉన్నా ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ విధ్వంసకర ఆటతీరుతో 30 పరుగులు సమర్పించుకున్న యశ్ దయాల్ నేటి మ్యాచ్ లో ఆడటం లేదు. ఇక పంజాబీ కుర్రాడే అయిన గిల్ కు మొహాలీలో మంచి రికార్డు ఉంది. పీబీకేఎస్ తో గడిచిన 9 ఇన్నింగ్స్ లలో అతడు 330 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ కెరీర్ బెస్ట్ స్కోరు (96) కూడా పంజాబ్ మీదే. నేటి మ్యాచ్ లో కూడా అతడు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడాలని గుజరాత్ కోరుకుంటున్నది.
మొహాలీలో పంజాబ్ కింగ్స్ కు ఘనమైన రికార్డు ఉంద. 2018 నుంచి ఇక్కడ 11 మ్యాచ్ లు ఆడిన పంజాబ్.. 9 మ్యాచ్ లలో నెగ్గింది. ఇక పంజాబ్ కింగ్స్ నేటి మ్యాచ్ లో పలు మర్పులను చేసింది. సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడా తుది జట్టులో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తీస్తే రబాడాకు ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన ఘనత దక్కుతుంది.
రబాడా కూడా యాడ్ అవడంతో పంజాబ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ హైదరాబాద్ తో మ్యాచ్ లో విఫలమైనా అతడు కుదురుకుంటే ప్రమాదకర ఆటగాడే. శిఖర్ ధావన్ కూడా భీకర ఫామ్ లో ఉన్నాడు. జితేశ్ శర్మ, భానుక రాజపక్స, సామ్ కరన్ లతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్, జితేశ్ శర్మ, భానుక రాజపక్స, సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రర్, కగిసొ రబాడా, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్ : వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ, జోషువా లిటిల్