సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ప్రస్తావన తెచ్చిన ధోనీ... విరాట్ ఎప్పుడూ ఫస్ట్ బాల్ ఇలా...

By Chinthakindhi RamuFirst Published May 8, 2023, 5:01 PM IST
Highlights

IPL 2023: ముంబై ఇండియన్స్‌పై ఈజీ విక్టరీ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్... ప్లేఆఫ్స్ బెర్త్‌కి చేరువలో ధోనీ సేన! విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలో బౌలర్లకు చెబుతూ.. 

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలుసు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, మాహీ తర్వాత భారత కెప్టెన్‌గా బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఐపీఎల్‌లో 16 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడుతున్న విరాట్ కోహ్లీ,ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు..

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కి 14 సీజన్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్లేయర్ల నుంచి 100 శాతం రిజల్ట్ రాబట్టడంలో ధోనీని మించిన వాళ్లు ఎవ్వరూ ఉండరు. తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చి 55 పరుగులు సమర్పించిన తుషార్ దేశ్‌పాండే, ఐపీఎల్ 2023 సీజన్‌లో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడంటే అది మాహీ మహిమే...

Dhoni talking to one of the CSK members by mentioning the name of Virat Kohli. pic.twitter.com/8Y09cWMvLw

— Johns. (@CricCrazyJohns)

Latest Videos

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను అవుట్ చేసేందుకు మాహీ వాడిన ట్రిక్, హిట్ మ్యాన్‌ని డకౌట్ చేసింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ బంతికి ముందు శార్దూల్ ఠాకూర్‌కి లెగ్ సైడ్ వేయాల్సిందిగా ధోనీ సూచించడం, ఫీల్డింగ్‌లో చేసిన మార్పులు... రోహిత్ శర్మ కోసం మాహీ పన్నిన ఉచ్చుని తెలియచేశాయి..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న విరాట్ కోహ్లీ కోసం కూడా సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌లో వ్యూహ రచన జరుగుతున్నట్టు ఆ టీమ్ నుంచి విడుదలైన ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. ‘విరాట్ ఎప్పుడూ మొదటి బంతిని అలా ఆడడు. బ్యాటు ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది..’ అంటూ బౌలర్లకు ధోనీ సూచిస్తున్నట్టు సీఎస్‌కే ఆల్‌రౌండర్ రాజ్‌వర్థన్ హంగర్కేకర్ పోస్ట్ చేసిన వీడియోలో స్పష్టంగా కనిపించింది..

ఐపీఎల్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, 10 ఇన్నింగ్స్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు బాదాడు.  ఈ రెండు జట్ల మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది..

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. డివాన్ కాన్వే 83, శివమ్ దూబే 52, అజింకా రహానే 37 పరుగులు చేయగా ఈ లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 218 పరుగులకి పరిమితమైంది. దీంతో 8 పరుగుల తేడాతో సీఎస్‌కేకి విజయం దక్కింది..

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, యంగ్ బౌలర్ ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వేర్వేరు గ్రూపుల్లో ఉన్న ఈ రెండు జట్లు, ఐపీఎల్ 2023 గ్రూప్ స్టేజీలో మళ్లీ ఆడడం లేదు. ఒకవేళ సీఎస్‌కే, ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది..

6 మ్యాచుల్లో గెలిచి 13 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, మరో 2 మ్యాచుల్లో గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. 10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచుల్లో కనీసం 3 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. 

click me!