
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఛాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్ నేడు ఈ లీగ్ లో మరో కీలక మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్- 16 లో పడుతూ లేస్తూ ఒకదశలో ప్లేఆఫ్స్ చోటు పక్కా అనుకున్న దశలో లక్నో సూపర్ జెయింట్స్ తో ఓడి వాటిని మరింత సంక్లిష్టం చేసుకున్న ముంబై ఇండియన్స్.. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక మ్యాచ్ ఆడుతున్నది. నేటి మ్యాచ్ లో రోహిత్ సేన.. హైదరాబాద్ ను భారీ తేడాతో ఓడిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాంఖెడేలో జరుగుతున్న కీలక పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్.. 7 మ్యాచ్ లు గెలిచి ఆరు ఓడింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది రోహిత్ సేన.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ తో పాటు ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ కు కూడా 14 పాయింట్లున్నాయి. కానీ నెట్ రన్ రేట్ విషయంలో బెంగళూరుకు కాస్త ఎడ్జ్ ఉంది. బెంగళూరు నెట్ రన్ రేట్ +0.180 ఉండగా రాజస్తాన్ కు +0.148, ముంబైకి -0.128 ఉంది.
ముంబై ప్లేఆఫ్స్ కు వెళ్లడం ఆ జట్టు ఫలితంతో పాటు గుజరాత్ - బెంగళూరు మ్యాచ్ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. బెంగళూరు వేదికగా నేటి రాత్రి 7.30 గంటలకు జరుగబోయే మ్యాచ్ లో ఆర్సీబీ ఓడితే అప్పుడు ముంబై ప్లేఆఫ్స్ కు వెళ్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా అది ముంబైకి కలిసొచ్చేదే. అయితే ఇలా కలిసిరావాలంటే ముంబై ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించాలి.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ ఫలితంతో పెద్దగా ఒరిగేదేమీలేదు.
ముంబై ఏం చేయాలి..?
వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఛేదనకు దిగనుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్.. 150 - 200 మధ్య టార్గెట్ పెడితే దానిని ఛేదించడానికి ముంబై.. మరో 70 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. అంటే హైదరాబాద్ ఎంత స్కోరు చేసినా ముంబై.. 11 - 12 ఓవర్లలోపే ఛేదించాలి.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహల్ వధేర, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్
సన్ రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, వివ్రంత్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, నితీశ్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సాన్వీర్ సింగ్, మయాంక్ దగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్