
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఆర్‌సీబీ వెంటాడిన సమస్య మిడిల్ ఆర్డర్ వైఫల్యం. టాపార్డర్‌లో ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అవుటైతే ఆర్‌సీబీ టపటపా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఎట్టకేలకు ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్ మెరిసి, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మంచి స్కోరు అందించింది.. టాపార్డర్‌లో డుప్లిసిస్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లతో పాటు యంగ్ క్రికెటర్ మహిపాల్ లోమ్రోర్ అద్భుత హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి శుభారంభం దక్కింది. ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 82 పరుగులు జోడించారు. ఈ దశలో విరాట్ కోహ్లీ 7 వేల ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకున్నాడు..
ఐపీఎల్‌లో 7 వేల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 32 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
ఆ తర్వాతి బంతికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మార్ష్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మ్యాక్స్‌వెల్. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. ఈ దశలో మహిపాల్ లోమ్రార్ వస్తూనే ఢిల్లీ బ్యాటర్లపై ఎదురుదాడి చేశాడు..
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన మహిపాల్ లోమ్రోర్, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఓ ఎండ్‌లో మహిపాల్ లోమ్రోర్ బౌండరీలతో దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ యాంకర్ రోల్ పోషించాడు..
46 బంతుల్లో 5 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2023 సీజన్‌లో ఆరో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేగం పెంచేందుకు ప్రయత్నించిన కోహ్లీ, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతికి మహిపాల్ లోమ్రోర్ అవుట్ అయినట్టు అంపర్ ప్రకటించినా రివ్యూకి వెళ్లిన ఆర్‌సీబీకి అనుకూలంగా ఫలితం దక్కింది..
అదే ఓవర్‌లో ఫోర్ బాదిన మహిపాల్ లోమ్రోర్, 26 బంతుల్లో ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. వస్తూనే సిక్సర్ బాదిన అనుజ్ రావత్ 3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేయగా మహిపాల్ లోమ్రోర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..