
ప్రీ క్లైమాక్స్ స్టేజ్ కు చేరుకున్న ఐపీఎల్-16లో ప్రస్తుతం జట్లన్నీ రివేంజ్‌తో పాటు ప్లేఆఫ్స్ మీద దృష్టి సారిస్తున్న నేపథ్యంలో నేడు మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఈ సీజన్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో తమను ఓడించిన పంజాబ్ కింగ్స్ ను ఓడించేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. ఈ మేరకు తమ సొంత డెన్ ఈడెన్ గార్డెన్ లో పంజాబ్ కింగ్స్ పై జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన నితీశ్ రాణా సేన ఫస్ట్ బౌలింగ్ కు రానుంది. టాస్ గెలిచిన శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ బ్యాటింగ్ కు రానుంది.
ఐపీఎల్ -16లో పంజాబ్ - కోల్‌కతా మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో కేకేఆర్ పై పంజాబ్ ఏడు పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో గెలిచింది. ఈ ఓటమికి బదులు తీర్చుకునేందుకు ఇప్పుడు కేకేఆర్ సిద్ధమైంది.
పాయింట్ల పట్టికలో 7, 8 వ స్థానాలలో ఉన్న పంజాబ్, కోల్‌కతా లకు ఈ మ్యాచ్ గెలవడం ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకం. ఇప్పటిదాకా 10 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్.. నాలుగు గెలిచి ఆరింట్లో ఓడింది. పంజాబ్ ఐదు గెలిచి ఐదు ఓడింది. నేటి మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే ముంబై, ఆర్సీబీ, రాజస్తాన్ లను అధిగమించి నాలుగో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. కేకేఆర్ కూడా తన స్థానాన్ని మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది.
ప్లేఆఫ్స్ కు కీలకం కావడంతో నేటి మ్యాచ్ లో పంజాబ్ డేంజరెస్ బ్యాటర్ భానుక రాజపక్సను తిరిగి జట్టులోకి రప్పించింది. మాథ్యూ షార్ట్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. కేకేఆర్ మాత్రం గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతున్నది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రర్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, అండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి